ఎంబుక్‌ లేకుండా నిధులు డ్రా? | - | Sakshi
Sakshi News home page

ఎంబుక్‌ లేకుండా నిధులు డ్రా?

Feb 6 2026 7:37 AM | Updated on Feb 6 2026 7:37 AM

ఎంబుక్‌ లేకుండా నిధులు డ్రా?

ఎంబుక్‌ లేకుండా నిధులు డ్రా?

ప్రత్తిపాడు పంచాయతీలో

అధికారుల నిర్వాకం

విచారణకు ఆదేశించిన డీపీఓ

ప్రత్తిపాడు: అధికారుల నిర్వాకంతో పంచాయతీ నిధులు గోల్‌మాల్‌ అయినట్లు తెలుస్తోంది. ఎం బుక్‌ లేకుండానే రూ. లక్షల్లో నిధులు డ్రా చేసి నిధులు కాజేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ రక్షిత మంచి నీటి చెరువుకు ఆయిల్‌ ఇంజిన్లు ద్వారా నీటిని పెట్టినట్లుగా లెక్కలు చూపుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జనవరిలో సుమారు రూ. 6 లక్షల వరకు డ్రా చేసినట్లుగా సమాచారం. వాస్తవంగా చెరువుకు నీరు పెడితే, ఆ సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పర్యవేక్షించి, చెరువు నింపడం పూర్తయిన తరువాత ఎంబుక్‌ రికార్డు చేయాలి. ఆ తరువాతనే అధికారులు ఎంబుక్‌ ఆధారంగా గ్రామ పంచాయతీ నుంచి నిధులు డ్రా చేసుకోవాలి. కానీ అసలు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఎంబుక్‌ చేయలేదని చెబుతుండగా, పంచాయతీ అధికారులు మాత్రం దర్జాగా డబ్బులు డ్రా చేసేశారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో పంచాయతీ అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఎంబుక్‌ కనిపించడం లేదని, ఎంబుక్‌ ఆడిట్‌ కార్యాలయంలో ఉందని, బీరువాల్లో దాచిపెట్టారని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఎమ్మెల్యే దృష్టికి కూడా దీనిని కొందరు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వినీల్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ పనికి సంబంధించి ఎంబుక్‌ చేయలేదని స్పష్టం చేశారు. ఈవోపీఆర్డీ షేక్‌ ఆదంషఫీని వివరణ కోరగా ఎంబుక్‌ తాను కూడా చూడలేదని, ఆడిట్‌ కార్యాలయంలో ఉందని ఓ ఉద్యోగి చెప్పారని, వారు సంతకం చేయమంటే తాను చేశానని చెప్పారు. డీపీవో బి.వి.నాగసాయికుమార్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి కూడా రావడంతో విచారణకు ఆదేశించామన్నారు. విచారణాధికారిగా డీఎల్‌పీవోను నియమించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement