గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి
బాపట్ల టౌన్: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతిచెందారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ (57) ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తెనాలిలోని హరిత హాస్పిటల్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతిక దేహాన్ని పొన్నూరు మండలం, గాయంవారిపాలెంలోని వారి స్వగృహం నందు ఉంచగా, బాపట్ల సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ డీఎస్పీ (సీసీఎస్ డీఎస్పీ) పి.జగదీష్ నాయక్, బాపట్ల పట్టణ సీఐ ఆర్.రాంబాబు, ఇతర పోలీసు అధికారులు, సహద్యోగులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణ 1990 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలోకి ప్రవేశించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి ఏఎస్‌ఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ మృతిచెందారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ భౌతిక దేహానికి పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. లక్ష నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గాయంవారి పాలెం సమీపంలో గల స్మశాన వాటికలో పోలీస్ అధికార లాంఛనాలతో ఏఎస్‌ఐ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


