● ఎస్‌ఐ పేరుతో డబ్బులు డిమాండ్
పీలేరు : సైబర్ నేరగాళ్లు నయా మోసానికి తెరతీస్తూ.. ఎస్‌ఐ పేరుతో డబ్బులు డిమాండ్ చేసిన సంఘటన పీలేరులో వెలుగు చూసింది. వివరాలిలా వున్నాయి. ఓ వ్యక్తి తాను ఎస్‌ఐ సురేష్‌నంటూ పీలేరు పట్టణంలోని ఓ బంగారు దుకాణం యజమానికి ఫోన్ చేశాడు. తన అకౌంట్‌కు రూ.25 వేలు వేయాలంటూ క్యూఆర్ కోడ్ పంపించాడు. పీలేరు పోలీస్ స్టేషన్‌లో సురేష్ అనే ఎస్‌ఐ ఎవరూ లేరని తెలుసుకుని, ఇది సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయమై స్థానిక సీఐ యుగంధర్‌ను వివరణ కోరగా సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా అనుమానం వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
మెడికల్ అండ్ హెల్త్ ఆర్డీగా గీతా బాయి
కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం(జోన్–4) రీజనల్ డైరెక్టర్‌గా డాక్టర్ గీతాబాయి నియమితులయ్యారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ రీజనల్ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ రామ గిడ్డయ్య ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్నారు. ఈ స్థానంలోకి డాక్టర్ గీతాబాయి రానున్నారు.
డాక్టర్ నాగరాజుకు ఆర్డీగా పదోన్నతి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పని చేస్తున్న డాక్టర్ నాగరాజుకు రీజినల్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈయన గుంటూరు(జోన్ –3) ఆర్డీగా బాధ్యతలు చేపట్టనున్నారు.


