మదనపల్లె టౌన్ : వేసవిలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రోడ్లపై నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో శుక్రవారం మదనపల్లె జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ధీరజ్ వేసవి రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా ఒక్కో సిబ్బందికి సూర్యుని ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను కాపాడే గాగుల్స్, తెల్లటి టోపీలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, స్టీల్ వాటర్ బాటిళ్లతోపాటు రెండు జతల ట్రాఫిక్ యూని ఫామ్‌ను అందజేశామన్నారు. అనంతరం ఎస్పీ సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకొని వివిధ రద్దీ కూడళ్లలో వారు నిర్వర్తిస్తున్న విధులపై ఆరా తీశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ గురునాథ్, ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ రవి, ట్రాఫిక్ మహిళా ఎస్‌ఐలు గాయత్రి, శివకామిణి, ఆర్‌ఎస్‌ఐ చంద్రశేఖర్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


