వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డి మంగళవారం కలిశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే నెపంతో తనను చెరుకుపల్లి ఎస్ఐ అనిల్‌కుమార్ అక్రమంగా స్టేషన్‌లో నిర్భందించి, విచక్షణారహితంగా లాఠీలతో కొట్టాడని.. తన శరీరంపై గాయాలను వైఎస్ జగన్‌కు కృష్ణార్జునరెడ్డి చూపారు.

టీడీపీ నాయకుల మెప్పు పొందడానికి కొంతమంది పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూద్దామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కృష్ణార్జునరెడ్డిని అక్రమంగా నిర్భందించి దాడిచేసిన ఎస్‌ఐ అనిల్‌పై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్‌పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ జగన్‌కు వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ వివరించారు. కృష్ణార్జున రెడ్డికి అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, అతని కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.


