సెలవిక.. శత్రుంజయ! ‘ఐఎన్‌ఎస్‌ మగర్‌’ యుద్ధ నౌక నిష్క్రమణ | Sakshi
Sakshi News home page

సెలవిక.. శత్రుంజయ! సేవల నుంచి నిష్క్రమించనున్న ‘ఐఎన్‌ఎస్‌ మగర్‌’ యుద్ధ నౌక

Published Sun, May 7 2023 9:22 AM

Warship INS Magar To Be Retired From Service - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నీటిలోనే కాదు.. నేలపైనా దాడి­­చేసే స్వభావం ఉన్న మొసలి (మగర్‌) లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న ఆ యుద్ధ నౌక వస్తుందంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేది. ఆయుధ సంపత్తిని మోసుకొస్తున్న ఆ నౌక కనిపిస్తే చాలు.. శత్రు సైన్యంతో పోరాడుతున్న బలగాలకు కొండంత ధైర్యం పోగవుతుంది. ఆపదలో ఉన్నవారికి ఆత్మీ­యత పంచుతూ.. విపత్తులో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చుతూ.. 36 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్‌ఎస్‌ మగర్‌ ఆదివారంతో విధులకు స్వస్తి పలకనుంది. వార్‌ఫేర్‌ వెసెల్‌గా అంతర్జాతీయ విన్యాసాల్లో సత్తా చాటిన మగర్‌కు భారత నౌకాదళం ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతోంది.

ఒడ్డుకు వచ్చి మరీ..
భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ఉభయచర యుద్ధ నౌకల్లో కీలకమైనదిగా ఐఎన్‌ఎస్‌ మగర్‌ ఖ్యాతి ఆర్జించింది. విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు సహకారంతో కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)లో మగర్‌ని యాంఫిబియాస్‌ షిప్‌గా తీర్చిదిద్దారు. అంటే.. సాధారణంగా షిప్‌లు ఒడ్డు వరకూ రాలేవు. కానీ.. మగర్‌ మాత్రం ఒడ్డు వరకూ వచ్చి.. సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అందుకే.. దీనికి మగర్‌ (తెలుగులో మొసలి అని అర్థం) అనే పేరుపెట్టారు. 1987 జూలై 15న భారత నౌకాదళంలో ఈ షిప్‌ ప్రవేశించింది.

విశాఖ నుంచి సుదీర్ఘ సేవలు
తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నానికి ఐఎన్‌ఎస్‌ మగర్‌ని కేటాయించారు. ల్యాండింగ్‌ షిప్‌ ట్యాంక్‌(ఎల్‌ఎస్‌టీ) హోదాలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. నలుగురు ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ వెహికల్‌ సిబ్బంది, అత్యవసర సమయంలో దళాల్ని మోహరించేందుకు మగర్‌ యుద్ధ నౌకను వినియోగించేవారు. శ్రీలంకలో ఎల్‌టీటీఈని నిరోధించే సమయంలో నిర్వహించిన ఆపరేషన్‌ పవన్‌లో మగర్‌ కీలక పాత్ర పోషించింది.

నిరంతర పోరాటం చేసిన ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌(ఐపీసీకే)కు అవసరమైన సామగ్రిని అందించింది. వివిధ దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లో మగర్‌ సత్తా చాటింది. 2006 ఫిబ్రవరి 22న విశాఖ తీరానికి 70 కి.మీ. దూరంలో మగర్‌ యుద్ధ నౌకలో ఘోర ప్రమాదం సంభవించింది. షిప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు నావికులు మృతి చెందారు. మరో 19 మంది గాయాల పాలయ్యారు. 2018వ సంవత్సరం వరకూ విశాఖ కేంద్రంగా సేవలందించిన మగర్‌ను 2018 ఏప్రిల్‌లో కొచ్చికి తరలించి.. మార్పులు చేర్పుల అనంతరం మొదటి స్క్వాడ్రన్‌ శిక్షణ నౌకగా సేవలు అందించింది. సునామీలో విశిష్ట సేవలు మగర్‌ అందించిన సేవల్లో ముఖ్యంగా 2004లో వచ్చిన సునామీ సమయమనే చెప్పుకోవాలి.

ఎప్పుడు మళ్లీ సముద్రం ఉప్పొంగి.. విలయం వస్తుందో తెలీని సమయంలో ధైర్యంగా సాగర జలాల్లో ప్రయాణించిన మగర్‌.. అండమాన్‌ నికో­బార్‌ దీవుల్లో చిక్కుకున్న 1,300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చింది. అంతేకాకుండా.. అక్కడి నుంచి వివిధ విపత్తు ప్రాంతాలకు తరలివెళ్లి నిరాశ్రయులుగా మిగిలిన వారికి సహాయక సామగ్రి అందజేయడంలోనూ కీలకంగా వ్యవహరించిన మగర్‌కు భారత రక్షణ దళం నుంచి అద్భుత ప్రశంసలందాయి. కోవిడ్‌ సమయంలో నిర్వహించిన ఆపరేషన్‌ సముద్ర సే­తు­లోనూ మగర్‌ విశిష్ట పాత్ర పోషిం­చింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసు­కురావడం, స్నేహపూర్వక దేశాలకు వైద్యసామగ్రి అందించడం మగ­ర్‌ ద్వారానే సాధ్యమైంది.

నౌకాదళంలో సేవలు ప్రారంభం:15 జూలై, 1987
పొడవు: 390 అడుగులు
వెడల్పు: 57 అడుగులు
డ్రాఫ్ట్‌: 13 అడుగులు
వేగం: గంటకు 28 కి.మీ. ప్రయాణ
సామర్థ్యం: ఏకధాటిగా 3 వేల మైళ్ల ప్రయాణం
ఆయుధ సామర్థ్యం: బీఈఎల్‌–1245 రాడార్‌ నావిగేటర్, నాలుగు బోఫోర్స్‌ 40 ఎంఎం గన్స్, 2 మల్టిపుల్‌ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్స్, ఒక సీ కింగ్‌ హెలికాప్టర్‌
వార్‌ ఫేర్‌ యూనిట్‌: 15 యుద్ధ ట్యాంకులు, 13 బీఎంపీ పదాతిదళ పోరాట వాహనాలు, 10 ట్రక్కులు, 8 భారీ మోటార్‌ వెహికల్స్‌తోపాటు 500 మంది సైనికుల్ని ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం.

నేడు కొచ్చిలో నిష్క్రమణం
నౌకాదళానికి 36 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన మగర్‌ యుద్ధ నౌకకు కొచ్చి పోర్టులో భారత నౌకాదళం ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించే డీకమిషన్‌ కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ మగర్‌లో సేవలందించిన కెప్టెన్‌లు, అధికారులకు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘అవర్‌ బోల్డ్‌ అండ్‌ బ్రేవ్‌ మగర్‌’ పేరుతో షార్ట్‌ ఫిల్మ్‌ని ప్రదర్శించి యుద్ధ నౌకకు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.

(చదవండి: మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి)

Advertisement
 
Advertisement