పని ఒత్తిడితో కుంగిపోతున్న పోలీస్ కానిస్టేబుళ్లు
రాష్ట్రంలో భారీగా కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ
ఉండాల్సిన కానిస్టేబుళ్లు 80 వేల మంది
ప్రస్తుతం ఉన్నది 48 వేల మందే
రోజుకు 16 గంటల నుంచి 18 గంటల డ్యూటీ
పేరుకుపోయిన టీఏ, డీఏ, సరెండర్ లీవుల బకాయిలు
ఇటీవల కాకినాడలో ధనరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పని భారం భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సహచర కానిస్టేబుళ్లు ఆయన్ను తక్షణమే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన పని ఒత్తిడితో కుంగిపోతున్న పోలీస్ కానిస్టేబుళ్ల దుస్థితిని మరోసారి చర్చనీయాంశం చేసింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రమైన పనిభారంతో కుంగిపోతున్నారు. శారీరకంగా.. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పోలీస్‌ల పని ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీ చేసినా.. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నతాధికారుల వేధింపులు కానిస్టేబుళ్లను మరింతగా కుంగదీస్తున్నాయి. అటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల వేధింపులతో కానిస్టేబుళ్లు మౌనంగా రోదిస్తున్నారు.
ఉండాల్సింది 80 వేలు.. ఉన్నది 48 వేల మందే
పోలీస్ కానిస్టేబుళ్లకు తీవ్రమైన పని ఒత్తిడికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్రంలో భారీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడం లేదు. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి లక్ష మంది జనాభాకు కనీసం 138 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. ఆ ప్రకారం రాష్ట్రంలో 5.50 కోట్ల మందికి కనీసం 80 వేలమంది కానిస్టేబుళ్లు అవసరం. కానీ.. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం కేవలం 48 వేల మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 45 శాతం మంది తక్కువగా ఉన్నారు.
అయినా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఆ మేరకు కానిస్టేబుళ్లను నియమించకపోగా.. అధికారికంగా మంజూరు చేసిన కానిస్టేబుల్ పోస్టులనైనా భర్తీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కానిస్టేబుల్ పోస్టుల్లో 18 వేల వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సివిల్ పోలీస్ విభాగంలో 5,159, ఏఆర్ విభాగంలో 4 వేలు, ఏపీఎస్పీ విభాగంలో 6,231, మినిస్టీరియల్ స్టాఫ్ విభాగంలో 3వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసే ఉద్దేశమే లేనట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
తీవ్ర పని ఒత్తిడితో కుంగుబాటు
నిబంధనల ప్రకారం కానిస్టేబుళ్లు మూడు షిప్టుల విధానంలో రోజుకు 8 గంటలపాటు విధులు నిర్వర్తించాలి. కానీ.. పోస్టులు భర్తీ చేయకపోవడంతో రెండు షిఫ్టుల విధానం అమలవుతోంది. అదికూడా వేళాపాళా లేకుండా పనిభారంతో అధికారులు వేధిస్తున్నారు. ఒక్కో కానిస్టేబుల్ రోజుకు 12 నుంచి 14 గంటలపాటు పని చేస్తున్నట్టు పోలీస్ శాఖ అంతర్గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో కానిస్టేబుళ్లు ఏకంగా 16నుంచి 18 గంటలపాటు పని చేయాల్సి వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మితిమీరిన స్థాయిలో వీఐపీల బందోబస్తు విధులు, ఎన్‌బీడబ్ల్యూ విధులు, నైట్ పెట్రోలింగ్ విధుల ఒత్తిడితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీక్లీ ఆఫ్‌ల విధానం కూడా అమలు చేయడం లేదు. అంటే వారంలో ఏడు రోజులూ పని చేయాల్సి వస్తోంది. కుటుంబానికి కనీస సమయం కేటాయించలేకపోతున్నారు. పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు వంటి విషయాలపై కూడా దృష్టి సారించలేకపోతున్నారు.
పేరుకుపోయిన టీఏలు, సరెండర్ లీవులు
కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వీఐపీ బందోబస్తు విధులు, ఎన్‌బీడబ్ల్యూ విధులు, కోర్టు విధులు, ఇతరత్రా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు ట్రావెలింగ్ అలవెన్సులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఖర్చులు భారీగా పెరిగిపోయినా.. దీర్ఘకాలంగా చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. 2024 జూన్ నుంచి టీఏ బకాయిలు చెల్లించనే లేదు. మరోవైపు సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవుల బకాయిలు సైతం పేరుకుపోయాయి. డీఏ బకాయిలు సరే సరి. రాష్ట్రంలో ఒక్కో జూనియర్ కానిస్టేబుల్‌కు రూ.లక్ష చొప్పున, సీనియర్ కానిస్టేబుల్‌కు రూ.2 లక్షల చొప్పున బకాయిలు ఉన్నాయి. అయినా సరే.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పనిభారం అమాంతంగా పెంచుకుంటూపోతోందని కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో 6,100 పోస్టుల భర్తీకి చర్యలు
రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తరువాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. అయితే, టీడీపీ ఆ పోస్టుల భర్తీని సవాల్ చేస్తూ కోర్టులో ఏకంగా 28 కేసులు వేసి అడ్డుకుంది. దాంతో అప్పటి మెయిన్ పరీక్షను నిర్వహించలేకపోయింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను వాపసు తీసుకోవడం గమనార్హం. అనంతరం ఆ పోస్టులను ప్రభుత్వం ఇటీవల భర్తీచేసి అది తమ
ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడింది. కానీ ఆ పోస్టులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన విషయం వాస్తవమని ఎంపికైన కానిస్టేబుళ్లు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


