విశాఖలో న్యాయమూర్తుల అతిథి గృహాలకు శంకుస్థాపన | Foundation stone laid for judges' guest houses in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో న్యాయమూర్తుల అతిథి గృహాలకు శంకుస్థాపన

Apr 19 2026 6:30 AM | Updated on Apr 19 2026 6:30 AM

Foundation stone laid for judges' guest houses in Visakhapatnam

న్యాయమూర్తుల అతిథి గృహాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ రవి చీమలపాటి తదితరులు


భూమిపూజ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌

కొమ్మాది: గ్రేటర్‌ విశాఖపట్నం 8వ వార్డు పరిధిలోని ఎండాడలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ శనివారం శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయ­మూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ రవి చీమలపాటితో కలిసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సాగరతీరాన్ని వీక్షించి, కొండ పై భాగం నుంచి కనిపించే పరిసరాలను పరిశీలించారు. 

నిర్మాణ ప్రక్రియ, ఇతర అంశాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలను కోర్టు, జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కోర్టులో పని చేసే జడ్జిలు, అధికారులతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం వారిని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆత్మీయంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌భరత్, ఆర్‌డీవో సంగీత్‌ మాధుర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement