మళ్లీ ఫస్ట్‌ వస్తోంది.. ముందు నెల జీతాలే ఇవ్వలేదు... | EmployeUnion Leaders fires on Chandrababu Govt over Contract Employees Salaries | Sakshi
Sakshi News home page

మళ్లీ ఫస్ట్‌ వస్తోంది.. ముందు నెల జీతాలే ఇవ్వలేదు...

Apr 29 2026 6:02 AM | Updated on Apr 29 2026 6:03 AM

EmployeUnion Leaders fires on Chandrababu Govt over Contract Employees Salaries

మొత్తం 177 ప్రభుత్వ విభాగాల్లో 50 వేల మందికిపైగా 

కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందలేదంటున్న ఉద్యోగ సంఘాల నేతలు

సాక్షి, అమరావతి: రెండు రోజుల్లో మళ్లీ ఒకటో తేదీ వస్తోంది. కానీ రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలే ఇంకా ఇవ్వలేదు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలకు సంబంధించిన పొదుపు సంఘాల కార్యక్రమాల్లో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) విభాగంలోని సుమారు 4,500 మంది ఉద్యోగులెవరికీ ఏప్రిల్‌ ఒకటో తేదీన అందాల్సిన జీతం నెల పూర్తవుతున్నా అందనే లేదు.

వీరికితోడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా శాఖ పరిధిలో జూనియర్‌ కాలేజీల్లో పని చేసే 3,600 మంది.. డిగ్రీ కాలేజీల్లో పని చేసే 900 మంది.. పాలిటెక్నికల్‌ కాలేజీల్లో పనిచేసే 500 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు సైతం ఏప్రిల్‌ ఒకటిన అందాల్సిన వేతనాలు ఇంకా రానే రాలేదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. వీరికితోడు పాఠశాల విద్య పరిధిలో పనిచేసే 4,500 మంది ఎంటీఎస్‌ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1,600 మంది టీచింగ్‌ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు కలిపి 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఏప్రిల్‌ ఒకటిన జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

50 వేల మందిపై తీవ్ర ప్రభావం
మొత్తం వందకు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50 వేల మందికి పైగా ఉద్యోగులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సెర్ప్‌ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27 వేల మందికి పైగా గ్రామ సమాఖ్య సహాయకులకు (వీవోఏ –  యానిమేటర్లు) సుమారు 4 నెలలుగా గౌరవ వేతనం విడుదల చేయలేదని ఆయా ఉద్యోగ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లు, సెర్ప్‌ ఉద్యోగులతోపాటు చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా ఆలస్యంగానే జీతాలు ఇచ్చి నట్టు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా నెల ముగిసేంత వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేది కాదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement