అనాథలకు అన్నగా..

CM Jagan Govt Helping Hand To who became orphaned children due to Covid‌ - Sakshi

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌

తల్లిదండ్రుల్ని కరోనా పొట్టనపెట్టుకోవడంతో అనాథలైన చిన్నారుల భవితకు భరోసా

ఒక్కొక్కరికీ రూ.10 లక్షల డిపాజిట్‌ 

వారి చదువు, ఆశ్రయం, భవితకు ఊతం

ఇప్పటివరకు 146 మంది బాలల గుర్తింపు

56 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా అనాథలైన బాలలను ఆదుకునే చర్యలు ఊపందుకున్నాయి. తల్లిదండ్రుల్ని కరోనా పొట్టనపెట్టుకోవడంతో అనాథలుగా మారిన బాలల గుర్తింపు, వసతి కల్పన, విద్యావంతులను చేయడం వంటి చర్యలతోపాటు వారి భవితకు భరోసా కల్పించేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అభినందనలు అందుకోగా.. ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్‌ను అనుసరిస్తున్నాయి.

146 మంది గుర్తింపు
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పలు శాఖల సమన్వయంతో ఈ నెల 4వ తేదీ వరకు 146 మంది అనాథ బాలలను గుర్తించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తించిన వీరిలో 56 మంది అనాథ బాలలకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఆ మొత్తాన్ని అనాథలైన బాలల పేరిట డిపాజిట్‌ చేయడంతోపాటు వారి చదువు, ఆశ్రయం, భవితకు భరోసా ఇచ్చేలా ఆయా జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అనాథ బాలల్లో చాలా మందికి బాబాయి, తాత, మావయ్య వంటి బంధువులు ఉండటంతో వారి వద్ద ఆశ్రయం పొందేలా ఏర్పాట్లు చేశారు.

ఏడుగురు బాలలకు మాత్రం ఎవరూ లేకపోవడంతో చైల్డ్‌ కేర్‌ ఇనిస్టిట్యూట్‌(సీసీఐ)లో ఆశ్రయం కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడైనా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బాలలు ఉంటే తమకు సమాచారం అందించాలని, ప్రభుత్వ తోడ్పాటును వారికి అందేలా సహకరించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా కోరారు. డయల్‌ 181, 1098 టోల్‌ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top