రూ.6,756.92 కోట్ల కరెంట్‌ బాకీలు కట్టండి.. తెలంగాణకు కేంద్రం ఆదేశం | Central directive to Telangana Govt to pay Power Bills Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రూ.6,756.92 కోట్ల కరెంట్‌ బాకీలు కట్టండి.. తెలంగాణ సర్కారుకు కేంద్రం ఆదేశం

Aug 30 2022 3:31 AM | Updated on Aug 30 2022 2:48 PM

Central directive to Telangana Govt to pay Power Bills Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిపడ్డ రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకూ తెలంగాణకు అందచేసిన ఈ విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు దీర్ఘకాలంగా పేరుకుపోయాయి.

తెలంగాణ సర్కారు ఈ బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ విద్యుత్తు సంస్థలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని కోరింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే అంశాన్ని ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ప్రస్తావించారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తెచ్చారు. ఈ నేపథ్యంలో రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్‌ సింగ్‌ బిస్త్‌ సోమవారం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

సకాలంలో చెల్లించకపోవడంతో.. 
ఏపీ జెన్‌కో సరఫరా చేసిన 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కమ్‌లు రూ.3,441.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ ఏడాది జూలై 31 నాటికి మరో రూ.3,315.14 కోట్లు లేట్‌ పేమెంట్‌ సర్‌ చార్జీ పడింది. ఈ మొత్తం రూ.6,756.92 కోట్లను ఏపీకి చెల్లించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇన్నాళ్లూ మొండి వైఖరి
2019 ఆగస్టు 19న జరిగిన ఇరు రాష్ట్రాల సంయుక్త సమావేశంతో పాటు పలు సందర్భాల్లో ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ డిస్కమ్‌లు ఒప్పుకున్నా డబ్బులు మాత్రం విడుదల కాలేదు. 2020 జనవరిలో జరిగిన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ బకాయిల అంశాన్ని చర్చించారు. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలకు విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్‌ డీమెర్జర్‌ ప్లాన్‌) పూర్తైన తరువాత బకాయిల గురించి ఆలోచిస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తోంది. 

అప్పుచేసి మరీ కరెంట్‌ సరఫరా..
పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్ల (ఆర్‌ఈసీ) నుంచి 2014 జూన్‌ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5,625 కోట్ల రుణాలను ఏపీ జెన్‌కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేయగలిగింది. కానీ వాడుకున్న విద్యుత్‌కు తెలంగాణ డిస్కమ్‌లు డబ్బులివ్వకపోవడంతో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలకు  చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏపీజెన్‌కోకు ఏర్పడింది.

కేంద్రం జోక్యాన్ని కోరిన ఏపీ..
తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కోరింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్వహించిన ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శుల సమావేశంలోనూ ఈ మేరకు ఏపీ అధికారులు అభ్యర్థించారు. తెలంగాణ డిస్కమ్‌లు కేంద్రం నుంచి ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద పొందుతున్న రుణాన్ని ఏపీ జెన్‌కో బకాయిలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్‌ సూచించారు. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ కొత్త మెలిక పెట్టింది.

పట్టుబట్టి సాధించిన సీఎం జగన్‌..
తెలంగాణ సర్కారు మొండి వైఖరితో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలని పట్టుబట్టింది. గతేడాది నవంబర్‌లో తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి ఈ అంశాన్ని సీఎం జగన్‌ తెచ్చారు. బకాయిలు చెల్లించేలా తెలంగాణను ఆదేశించాలని కోరారు.

ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీతో జరిగిన భేటీలోనూ, తాజాగా ఈ నెల 22న మరోసారి ప్రధానిని కలిసినప్పుడు కూడా తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిల అంశాన్ని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే కేంద్ర విద్యుత్‌శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement