అమ్మకూ మధ్యాహ్న భోజనం

Andhra Pradesh: Mid Day Meals For Pregnant Women And Children At Anganwadi - Sakshi

అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు

2,389 కేంద్రాల్లో 1,57,015 మందికి లబ్ధి

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు 2,389 

గర్భిణులు 17,660

బాలింతలు 17,318 

ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 122,037

కడప కోటిరెడ్డి సర్కిల్‌: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చిన్నారులకు మాత్రమే భోజనం వండి పెట్టేవారు.

ఈ నెల 1 నుంచి గర్భిణులు, బాలింతలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. జిల్లాలో 2,389 అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులు 17,660, బాలింతలు 17,318, ఏడాదిలోపు పిల్లలు 16,732, మూడేళ్లలోపు చిన్నారులు 57,072, ఆరేళ్లలోపు వారు 48,233 మంది ఉన్నారు. వీరిలో రక్తహీనత నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు.

మెనూలో సమూల మార్పులు
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడి అన్నమే అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మెనూలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న సమయంలో పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు రుచికరమైన భోజనం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసి అమలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. భోజనం తర్వాత తల్లులకు 200 మి.లీ.పాలు, పిల్లలకు 100 మి.లీ. పాలు అందించాలని నిర్ణయించారు.

నాణ్యమైన పౌష్టికాహారం 
అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు. నాణ్యమైన పౌష్టికాహారం అందించడం చిన్నారుల ఎదుగుదలకు దోహద పడుతుంది. కరోనా సమయంలో నిలుపుదల చేసిన ఈ విధానం తిరిగి ఈ నెల 1 నుంచి అమలులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం. వేడి భోజనం అందించడం సంతోషదాయకం.
– జి.గౌరి, గర్భిణి, కడప

రోజూ గుడ్డు, పాలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పోషకాహారం అందిస్తుండటం సంతోషదాయకం. మాలాంటి వారికి ఎంతో ప్రయోజనకరం. మెనూలో రోజూ కోడిగుడ్డు, పాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం, దానిని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించడం హర్షించదగ్గ విషయం.
–కె.శ్రుతి, బాలింత, కడప

సద్వినియోగం చేసుకోవాలి
గర్భిణులు, బాలింతలు, చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నాం. దీనిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎంఎన్‌ రాణి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, ఐసీడీఎస్, కడప

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top