‘రెడ్‌’ అలర్ట్‌!

Andhra Pradesh government focus on red sandalwood smuggling - Sakshi

శేషాచలంలో నిరంతర కూంబింగ్‌.. పీడీ కేసులు

సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ సత్ఫలితాలనిస్తోంది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ను ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) పరిధిలోకి తెస్తూ రూపొందించిన వ్యూహం విజయవంతమవుతోంది. రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తూ డీఐజీ పర్యవేక్షణలో ‘సెబ్‌’ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేస్తోంది. 

పటిష్ట నిఘా.. ముమ్మర కూంబింగ్‌
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ‘సెబ్‌’ బహుళ అంచెల వ్యవస్థను నెలకొల్పింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసుల సహకారంతో పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో స్మగ్లర్లను గుర్తించి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. మన రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల నరికి వేతలో పాల్గొంటున్న కూలీలు, రవాణా వాహనా లను సమకూర్చే వారిని గుర్తించింది. స్మగ్లర్లపై హిస్టరీ షీట్స్‌ తెరవడంతోపాటు పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తోంది. శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ ముమ్మరం చేసింది. కనీసం రెండు పార్టీలు నిరంతరం కూంబింగ్‌ చేసేలా షెడ్యూల్‌ రూపొందించింది. అటవీ, రెవెన్యూ, ఎన్‌హెచ్‌ఏఐ శాఖల సహకారంతో దాడులు తీవ్రతరం చేస్తోంది. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కీలక ప్రదేశాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. 

దశాబ్దం తరువాత తొలిసారిగా..
రెండేళ్లుగా సెబ్‌ బృందాలు పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నాయి. 520 కేసులు నమోదు చేసి 2,546 మందిని అరెస్టు చేశారు. 18,033 ఎర్రచందనం దుంగలు, 345 వాహనాలను జప్తు చేశారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ తగ్గుముఖం పట్టడం దశాబ్దం తరువాత ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top