అనంతపురం: అనంతపురంలో అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. చంద్రబాబు మోసాలకు నిరసనగా లలిత కళాపరిషత్ వద్ద వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో కలిసి అనంత నల్లబెలూన్లు ఎగురవేశారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించి ప్రజలను దగా చేసిన చంద్రబాబు తీరును ఎండగట్టారు. మండుటెండలోనే భారీ ర్యాలీ చేపట్టారు. సప్తగిరి సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి టవర్‌క్లాక్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆంక్షలు విధిస్తూ దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించారు. అనంతరం రెండేళ్లుగా సీఎం చంద్రబాబు చేసిన మోసాలను అనంత వెంకటరామిరెడ్డి ఎండగట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయన్నారు. రెండేళ్లు గడిచినా హామీల అమలులో విఫలమయ్యాయని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తొలి సంతకం చేసిన డీఎస్సీని అక్రమాలకు నిలయంగా మార్చాన్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసులతో పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. అనంతపురంలో ప్రజాప్రతినిధులే అక్రమాలకు పాల్పడుతున్నారని, నకిలీ రిజిస్ట్రేషన్లు, భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు నరేష్ కుమార్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు బోయ తిప్పేస్వామి, అనంత చంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, నదీం అహమ్మద్, ఎస్‌ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మాజీ మేయర్ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య తదితరులు పాల్గొన్నారు.
ఎగిసిపడిన నిరసన కెరటం
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ మహా నిరసన కెరటంలా ఎగసిపడింది. అనంతపురం రూరల్ కళ్యాణదుర్గం రోడ్డులోని నరిగమ్మ ఆలయం నుంచి జాతీయ రహదారి–44 వరకు వేలాదిమందితో ర్యాలీ సాగింది. రోడ్డు పొడవునా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన వంచనను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చివరకు డ్వాక్రా సంఘాలే లేకుండా చేస్తున్నారని చంద్రబాబుపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు.
నయవంచనపై నిరసనాగ్రహం
రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ విజయవంతమైంది. కార్యక్రమానికి వేలాది మంది పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. లక్ష్మీ బజార్ నుంచి వినాయక సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వినాయక సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు, సూపర్ సిక్స్ హామీల అమలు అటకెక్కించడంపై మెట్టు గోవిందరెడ్డి మండిపడ్డారు.
అసత్యానికి ప్రతీక చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్యానికి ప్రతీక అని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ పరిశీలకుడు శివశంకర్‌రెడ్డి అన్నారు. గుంతకల్లులో ‘చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హనుమేష్ నగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్, పొట్టి శ్రీరాములు సర్కిల్, మున్సిపల్ కార్యాలయం మీదుగా వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’పై తిరుగుబాటు
జిల్లా వ్యాప్తంగా వైఎసార్‌సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన ప్రజలు
నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబుపై భగ్గుమన్న యువత, మహిళలు
మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారంటూ మండిపాటు


