అనంతపురం ఎడ్యుకేషన్: నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ప్రకటించిన ‘మనబడి–మన పండుగ’ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల సాదాసీదాగా జరిగింది. స్వాగత తోరణాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల హాజరు వంటివి అనేక పాఠశాలల్లో కనిపించలేదు.
● కొత్త బ్యాగులు, యూనిఫాంలు, బెల్టులు, షూ–సాక్సులు, నోట్‌బుక్కులు అందుతాయన్న ఆశతో బడులకు వచ్చిన విద్యార్థులకు ఏవీ అందలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు ఏ ఒక్క పాఠశాలలోనూ పంపిణీ కాలేదు. జిల్లాకు బ్యాగులే చేరకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. కొన్ని మండలాలకు యూనిఫాం క్లాత్ చేరినా విద్యార్థులకు అందించలేదు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 1,93,223 మంది విద్యార్థులు ఉన్నారు. తొలిరోజే పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, చాలా పాఠశాలల్లో పంపిణీ పూర్తికాలేదు. జిల్లాకు అవసరమైన 10,16,544 పుస్తకాలలో 9,92,672 టైటిల్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మండలాల నుంచి ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలను పరిశీలిస్తే విద్యార్థులకు అందిన పుస్తకాల శాతం 50కి కూడా చేరలేదు.
● ‘మనబడి–మన పండుగ’ కార్యక్రమానికి విద్యార్థుల హాజరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ, చాలా చోట్ల అలాంటి ఏర్పాట్లు కనిపించలేదు. ఇక మనబడి నాడు–నేడు రెండో విడత పనులు చేపట్టిన పాఠశాలల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. భవనాల మరమ్మతులు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల పను లు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తొలి రోజే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్లుగా నిలిచిపోయిన పనులను ప్రభుత్వం పట్టించుకోలేదని హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి స్వాగతం పలకాల్సిన పాఠశాలలు కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులను ఆహ్వానించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బడులకొచ్చిన విద్యార్థులకు నిరాశే స్వాగతం
జిల్లాలో సాదాసీదాగా ‘మనబడి–మన పండుగ’
తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలతో తప్పని ఇబ్బందులు


