తాడిపత్రిటౌన్: వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి కోరుతూ ఎస్పీకి మెయిల్ చేశామని పెద్దారెడ్డి చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా జీపులోకి ఎక్కించి, నియోజకవర్గం దాటించి పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట వద్ద వదిలేశారు. కాగా గురువారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను ర్యాలీకి రావద్దంటూ పోలీసులు ఫోన్‌లు చేసి హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసేశారు. శుక్రవారం తాడిపత్రిలో భారీగా పోలీసులను మోహరింపజేసి కార్యక్రమం జరగకుండా నిలువరించారు.


