ఇక విద్యుత్‌ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు | - | Sakshi
Sakshi News home page

ఇక విద్యుత్‌ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు

Jun 13 2026 7:44 AM | Updated on Jun 13 2026 7:44 AM

అనంతపురం టౌన్‌: ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. మొబైల్‌ ఫోన్‌కు రీచార్జ్‌ చేసుకుంటేనే వ్యాలిడిటీ పెరిగి ఫోన్‌ మాట్లాడుకునేందుకు ఎలా వీలవుతుందో.. అదే తరహాలోనే రీచార్జ్‌ చేసుకుంటేనే విద్యుత్‌ సరఫరా అవుతుంది. విద్యుత్‌ వృథాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా స్మార్టు మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జూన్‌ 1 నుంచి 24 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్‌ విధానం అమలులోకి వచ్చింది. ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు ప్రతి నెలా రీచార్జ్‌ చేస్తేనే విద్యుత్‌ సరఫరా అవుతుంది. 12 నెలల విద్యుత్‌ బిల్లును ర్యాండమ్‌గా తీసుకొని నెల వారీగా విద్యుత్‌ ఖర్చు (యూనిట్లు) ఏమాత్రం ఉంటుందో అంఛనా వేసి, అందుకనుగుణంగా రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులు ముందుగానే వినియోగదారునికి అలర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. ఇలా మొబైల్‌కు మెసేజ్‌ వచ్చిన వెంటనే వినియోగదారుడు ఎంత మేర విద్యుత్‌ వినియోగించారు.. అందు కోసం పెట్టిన ఖర్చు మిగిలిన బ్యాలెన్స్‌ వివరాల సమాచారం మొత్తం వినియోగదారునికి మొబైల్‌లో సందేశాన్ని పంపుతారు. అలా మెసేజ్‌ వచ్చిన వెంటనే విద్యుత్‌ వినియోగించడం తగ్గించుకోవడమో..లేదంటే రీచార్జ్‌ చేసుకోవడమో వినియోగదారులు నిర్ణయించుకుంటారు. ఒక వేళ రీచార్జ్‌ చేసుకునేందుకు ఆలస్యమైతే గృహ వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జ్‌ చేసుకుంటే కొన్ని నిమిషాల్లోనే విద్యుత్‌ పునరుద్ధరిస్తారు. ఇందు కోసం స్మార్ట్‌ మీటర్ల కంపెనీ ఒక కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి, తమ సిబ్బంది చేత మానటరింగ్‌ చేస్తారు.

200 యూనిట్లు వాడే వినియోగదారులకు..

అనంతపురం జిల్లాలో 14 వేల ప్రభుత్వ కార్యాలయాలకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 10 వేల కార్యాలయాలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రీపెయిడ్‌ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేశారు. ప్రీపెయిడ్‌ స్మార్టు మీటర్ల పనితీరు ఎలా ఉంది? అనే వివరాలు జూలై మొదటి వారంలో తెలియనుంది. ఈ విధానంపై ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా సర్వీసులకు స్మార్టు మీటర్లను ఏర్పాటు చేశారు. అందులో జూన్‌ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ప్రీపెయిడ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంపై అన్ని శాఖల ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి, స్మార్టు మీటర్ల విధానం బాగుదంటే మలివిడతలో 200 యూనిట్లు విద్యుత్‌ వాడే వినియోగదారులకు ప్రీపెయిడ్‌ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 17 లక్షలకు పైగా విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. వాటిలో 200 యూనిట్లు విద్యుత్‌ వినియోగం ఉన్న సర్వీసులు 2.50 లక్షలకు పైగానే ఉన్నాయి. వాటికి సైతం ప్రీపెయిడ్‌ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేయనున్నారు.

విద్యుత్‌ వృథా అరికట్టడంలో కీలకం..

విద్యుత్‌ వృథా ఖర్చు, దుర్వినియోగాన్ని ప్రీ పెయిడ్‌ స్మార్టు మీటర్లతో పూర్తి స్థాయిలో అరికట్టడంలో కీలకంగా పనిచేస్తాయి. వీధి దీపాలు ప్రతి రోజు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉంటాయి. స్మార్టు మీటర్లకు వీధి దీపాలను అనుసంధానం చేయడంతో సాయంత్రం 6 గంటలకు వెలుగునిచ్చి ఉదయం 6 గంటలకు ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతాయి. దీంతో విద్యుత్‌ ఖర్చు సైతం అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది.

ప్రీపెయిడ్‌ స్మార్టు మీటర్ల విధానం అన్ని రకాల విద్యుత్‌ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యుత్‌ వినియోగం సైతం పొదుపుగా వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేస్తున్నాం. వచ్చే నెల 1 నుంచి 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగించే సర్వీసులకు అమలు చేయనున్నాం. స్మార్టు మీటర్ల ఏర్పాటుకు వినియోగదారులు సహకరించాలి.

– శేషాద్రి శేఖర్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, అనంతపురం

ఉమ్మడి అనంత జిల్లాలో 2 లక్షల కనెక్షన్ల ఏర్పాటు

మలి విడతలో 200 యూనిట్లు విద్యుత్‌ వాడే వినియోగదారులకు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement