మహా శోభాయాత్రకు సర్వం సిద్ధం

Prepare everything great Ganesh sobhayatra - Sakshi

    పూజలు, భజనలతో నేడే గణపయ్యల నిమజ్జనాలు 

     హుస్సేన్‌సాగర్‌ సహా 35 ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి 

     ఉదయం 7గం. నుంచే ఖైరతాబాద్‌ గణపతి శోభాయాత్ర  

     వీలైనంత త్వరగా నిమజ్జనాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: నవరాత్రులు అశేష భక్తుల పూజలు అందుకున్న గణపతుల నిమజ్జనానికి మహానగరం సిద్ధమైంది. మహాపూజలు, భజనలు, దరువుల కోలాహలం మధ్య గణపయ్యను సాగనంపేందుకు భక్తజన మండలిలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఉదయం 7 గంటల నుంచే శోభాయాత్రలు ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేసేలా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 30,000ల మంది పోలీసులతో పాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, జల మండలి, సాంస్కృతిక శాఖలు నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొననున్నాయి. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని 23 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొలనుల్లో, మరో 12 చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన ప్రక్రియను వేగంగా చేసేందుకు అధునాతన టెక్నాలజీతో కూడిన హుక్‌లను ఈసారి అన్ని క్రేన్లకు వినియోగించనున్నారు. చెరువుల వద్ద బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. 

ఉదయం 7 గంటలకే మహా గణపతి శోభాయాత్ర.. 
నిమజ్జనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్‌ సప్తముఖ సర్ప గణపతి శోభాయాత్ర ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం కానుంది. దీనికోసం శనివారం సాయంత్రమే వెల్డింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. 500 మంది ప్రత్యేక కళాకారుల నృత్య ప్రదర్శనలు, కీర్తనల నడుమ మధ్యాహ్నం 1.30 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. భారీ విగ్రహాలన్నీ దాదాపు హుస్సేన్‌సాగర్‌కే చేరుకుంటుండటంతో 213 పెద్ద క్రేన్లు, ప్రత్యేక లైటింగ్, ఫైరింజన్లు, ఎమర్జెన్సీ రెస్క్యూ టీంలను సిద్ధం చేశారు. మొత్తంగా నిమజ్జన కార్యక్రమాన్ని రాత్రి పన్నెండు గంటల కల్లా పూర్తి చేసి, సోమవారం నగరంలో యథావిధిగా కార్యకలాపాలు జరిగేలా చూడాలని అధికారులు ముందుకు వెళుతున్నారు.

బాలాపూర్‌ లడ్డూకు క్రేజ్‌.. 
ఈ సారి బాలాపూర్‌ లడ్డూకు విపరీతంగా క్రేజ్‌ నెలకొంది. 1994 నుంచి ఏటేటా పెరుగుతూ వస్తున్న లడ్డూ ధర.. ఈ సారి కూడా భారీగానే పలికే అవకాశం ఉంది. గతేడాది రూ.15.60 లక్షల ధర పలుకగా ఎన్నికల సీజన్‌ కావడంతో ఈ సారి నాయకులు కూడా లడ్డూ కోసం వేలంలో పాల్గొననున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top