నాలుగో దశ ‘మిషన్‌’ ఆరంభం | harish rao about mission kakatiya | Sakshi
Sakshi News home page

నాలుగో దశ ‘మిషన్‌’ ఆరంభం

Nov 29 2017 1:50 AM | Updated on Nov 29 2017 1:50 AM

harish rao about mission kakatiya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ నాలుగో దశ చెరువుల పునరుద్ధరణ కోసం పరిపాలన అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో 28 చెరువుల పునరుద్ధరణకు మైనర్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సురేశ్‌కుమార్‌ రూ.4.97 కోట్ల అంచనా విలువతో ప్రభుత్వామోదానికి పంపగా, మంగళవారం సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు ఫైలుపై సంతకం చేశారు. ఈ చెరువుల పునరుద్ధరణ జరిగితే 1,450 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. వెంటనే ఈ చెరువుల పునరుద్ధరణకు సాంకేతిక అనుమతులిచ్చి టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించాలని సంబంధిత ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు.

మిషన్‌ కాకతీయ నాలుగో దశ టైం లైన్లను విధిగా పాటించాలని, ఈ నెల 30 నాటికి చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయానికి నాలుగో దశ చెరువుల అంచనాలను పంపాలని మంత్రి కోరారు. ఆ తర్వాత వచ్చే చెరువుల అంచనాలకు అనుమతి ఇవ్వబోమన్నారు. డిసెంబర్‌ 15 నాటికి చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయం అంచనాలను ప్రభుత్వానికి పరిపాలన అనుమతులకు పంపాలని ఆదేశించారు. డిసెంబర్‌ 31 వరకు పరిపాలన అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌ను మంత్రి కోరారు.

జనవరి మొదటి వారంలో చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభం కావాలని సూచించారు. మిషన్‌ కాకతీయ రెండో, మూడో దశలో ప్రారంభించి పూర్తి కాకుండా మిగిలిపోయిన చెరువుల పనులు కూడా పూర్తి చేసి ఫైనల్‌ బిల్లులు చెల్లించాలని ఇంజనీర్లను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ పనుల ప్రారంభానికి ముందే వ్యవసాయ శాఖ అధికారులతో చెరువు పూడిక మట్టి పరీక్షలు జరిపించాలని, పూడిక మట్టి తీసుకెళ్లేలా రైతులకు పత్రికల ద్వారా సమాచారం అందించాలన్నారు. మిషన్‌ కాకతీయ నాలుగో దశ పునరుద్ధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement