‘జోనల్‌’కు కేబినెట్‌ ఆమోదం; ఢిల్లీకి సీఎం కేసీఆర్

Cabinet Approves For Zone system, Insurance Scheme - Sakshi

హైదరాబాద్‌: నూతనంగా ఏర్పాటు చేసిన జోనల్‌ వ్యవస్థకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎల్ఐసీ ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి కూడా పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశం జరిగింది. విస్తృత చర్చ అనంతరం జోనల్‌ వ్యవస్థ, బీమా పథకాలను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక ఆహ్వానం మేరకు టీఎన్‌జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస గౌడ్, టీఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానమంత్రిని కోరడానికిగానూ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

కేబినెట్ ఆమోదించిన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి.
తెలంగాణలో ఇకపై ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉంటాయి.
స్టేట్ కేడర్ పోస్టులను ఖచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు.
ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యాబ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాబ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా గుర్తిస్తారు.
అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరిగా ఉంటుంది.
రాష్ట్రంలోని 18-60 ఏండ్ల వయస్సున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవితబీమా వర్తిస్తుంది.
ఎల్ఐసీ ద్వారా జీవిత బీమా అమలు చేస్తారు. ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రీమియం కడతారు. బీమా ప్రీమియానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం బడ్జెట్లోనే కేటాయిస్తుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు.
వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సాలకు పెంచుతారు.
రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతో పాటు ఇతర వైద్యసిబ్బందిని నియమిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top