ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ

Ashwathama Reddy Calls Off TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాల జేఏసీ మరోసారి వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు.  సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కార్మికులంతా రేపు ఉదయం 6 గంటలకు విధులకు హాజరు కావాలని నిర్ణయించారు.  అలాగే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మికులకు సూచించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు. డిపోల వద్దకు వెళ్లిన కార్మికులను అడ్డుకోవద్దని యాజమాన్యాన్ని కోరారు. కార్మికులదే నైతిక విజయమని తెలిపిన ఆయన.. ఇందులో ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదని.. ప్రభుత్వం గెలువలేదని వ్యాఖ్యానించారు. 

అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపు విధులకు రావద్దని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ అండగా ఉంటుందని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను రక్షించడంతో పాటు, కార్మికుల హక్కుల రక్షణ కోసమే పోరాటం చేశామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు సహకరించిన కార్మికులకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇది పోరాటానికి నాంది  మాత్రమేనని పేర్కొన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని, కార్మికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమ్మె విరమించినట్టు వెల్లడించారు. సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారానికే తప్ప.. విధులను విడిచిపెట్టడానికి కాదని స్పష్టం చేశారు. సమ్మెకు ముందు ఉన్నటువంటి వాతావరణం కల్పించి ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధులు నిర్వర్తించేలా చూడాలని జేఏసీ నాయకులు కోరారు.  

కాగా, అక్టోబర్‌ 5వ తేదీన ప్రారంభమైన సమ్మె.. 52 రోజుల పాటు కొనసాగింది. అయితే వారం రోజుల క్రితం ఆర్టీసీ సమ్మె చట్టబద్ధమా, వ్యతిరేకమా నిర్ణయించే అధికారం లేబర్‌ కోర్టుకు ఉందని తెలుపడంతో జేఏసీ సమ్మె విషయంలో వెనక్కి తగ్గింది. కానీ మరసటి రోజే  సమ్మె కొనసాగిస్తున్నట్టు జేఏసీ మరో ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గత నాలుగు రోజులుగా కార్మికులు విధుల్లోకి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం వారిని తిప్పి పంపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top