ఉత్కంఠ...

ఉత్కంఠ... - Sakshi


నేడు బీబీఎంపీ మేయర్ ఎంపిక

పోటాపోటీ రిసార్ట్ రాజకీయాలు


 

బెంగళూరు :బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) మేయర్ ఎంపిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ప్రధాన పార్టీలతో పాటు నగర ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు మేయర్ ఎన్నిక విషయమై పోటాపోటీగా బెంగళూరులో రిసార్టు రాజకీయాలు నడుపుతుండగా వారి అనుచరులు పదవులు ఎవరికి దక్కుతాయన్న విషయమై ఆ రిసార్టుల వద్ద  తీవ్రంగా చర్చించుకుంటున్నారు. బీబీఎంపీ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 24 సీట్లు తక్కువగా వచ్చినా...  జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్ పీఠాన్ని     దక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది.



అందులో భాగంగా హస్తం, జేడీఎస్ అధినాయకులు తమ పార్టీ కార్పొరేటర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు చేజారి పోకుండా ఉండేందుకు వారం రోజులుగా కేరళ, మడికేరిలోని వివిధ రిసార్టుల్లో ఉంచారు. శుక్రవారం మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వివిధ రిసార్టుల్లో ఉన్న జేడీఎస్, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు గురువారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత బెంగళూరుకు చేరుకున్నారు. ఇందులో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫైవ్‌స్టార్ హోటల్స్ అయిన తాజ్‌వెస్ట్‌ఎండ్, ఛాన్సురిపెవిలియన్‌లలో ఉండగా జేడీఎస్ కార్పొరేటర్లు ఈగల్‌టన్ రిసార్ట్‌లో ఉన్నారు. ఇక బీజేపీ కూడా తన కార్పొరేటర్లను నగర శివారులోని గోల్డన్‌ఫామ్ రిసార్టుకు చేర్చింది. స్వతంత్ర అభ్యర్థుల్లో కొంతమంది కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలిసి ఉండగా మరికొంతమందికి జేడీఎస్ నాయకులు తమతో పాటు ఆశ్రయం కల్పించారు. ఆయా పార్టీలకు చెందిన కార్పొరేటర్లు శుక్రవారం నేరుగా మేయర్ ఎన్నిక జరిగే చోటుకు చేరుకోనున్నారు.



 స్థాయీ సంఘాల్లో సింహభాగం స్వతంత్రులదే...

 ఈసారి బీబీఎంపీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి కాంగ్రెస్ పార్టీకు మద్దతిస్తున్న ఏడుగురికి ఏడు స్థాయీ సంఘాల అధ్యక్ష పదవులు లభించనున్నాయి. అదే విధంగా పొత్తులో భాగంగా రెండు స్థాయీ సంఘాల అధ్యక్ష పదవులు దక్కనున్నాయి. ఇక కాంగ్రెస్‌కు ప్రధానమైన ఆర్థిక, పన్నుల, పాలనకు సంబంధించిన మూడు అధ్యక్ష పదవులు తీసుకోనుంది. ఈ మేరకు కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పొత్తుకు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మేయర్, ఉపమేయర్ ఎంపిక విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ గురువారం పొద్దుపోయేవరకూ నగరానికి చెందిన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులతో మంతనాలు జరిపారు. మేయర్, ఉపమేయర్ అభ్యర్థుల పేర్లను గురువారం రాత్రికి గాని, నేడు ఉదయం కాని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.



 నిషేదాజ్ఞలు

 మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎటువంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిషేదాజ్ఞలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ వెళ్లడించారు. బీబీఎంపీ ప్రధాన కార్యాలయం చుట్టు ఉన్న 500 మీటర్ల పరిధిలో ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకూ నగరంలో ఎక్కడా కూడా విజయోత్సవరాలీలు నిర్వహించకూడదని ఆయన పేర్కొన్నారు.

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top