ర చయితల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎవరు అడ్డుపడినా సహించేది లేదని ప్రముఖ రచయిత్రి సారా అబూబకర్ పేర్కొన్నారు.
సాక్షి, బెంగళూరు: ర చయితల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఎవరు అడ్డుపడినా సహించేది లేదని ప్రముఖ రచయిత్రి సారా అబూబకర్ పేర్కొన్నారు. కర్ణాటక రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడవ అఖిల కర్ణాటక రచయిత్రుల సమ్మేళనం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన సారా అబూబకర్ అధ్యక్షోపన్యాసం సందర్భంలో మాట్లాడుతూ...
అనేక సందర్భాల్లో కొంత మంది వ్యక్తులు రచయితల రచనలపై ఆంక్షలు విధిస్తూ, వారి భావవ్యక్తీకరణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రచయితలు ఏ ఒక్క వ్యక్తికో, వర్గానికో గులాములుగా ఉండాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని అన్నారు. రచయితలపై ఎలాంటి ఒత్తిళ్లు లేనప్పుడు మాత్రమే ఉత్తమ రచనలు ప్రజల్లోకి అందుబాటులోకి వస్తాయని, అప్పుడే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఒక నవలను రాసినందుకు గాను రచయితను జైల్లో పెట్టిన సందర్భాలు దేశంలో ఎక్కడా లేవని, అయితే కర్ణాటకలో మాత్రం డుంఢి అనే నవలను రాసిన యోగీష్ మాస్టర్ అనే రచయితను ప్రభుత్వం జైలుకు పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన లు పునరావృతమైతే తామెంత మాత్రం సహించబోమని హెచ్చరించారు. మహిళా సాహిత్య క్షేత్రంలో కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
విద్యావంతులైన యువతులు ప్రస్తుతం ఐటీ తదితర రంగాల పట్ల మాత్రమే ఆకర్షితులవుతుండడంతో రచయిత్రుల సంఖ్య పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కర్ణాటక రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ వసుంధరా భూపతి, మాజీ అధ్యక్షురాలు ప్రతాభా రేతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన రచయిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.