ఎంపీ అత్యాచారం కేసు వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేశారు | BSP MP Dhananjay Singh didn't rape me: Woman | Sakshi
Sakshi News home page

ఎంపీ అత్యాచారం కేసు వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేశారు

Apr 5 2014 11:13 PM | Updated on Jul 28 2018 8:51 PM

బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్ నాలుగేళ్లపాటు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన 42 ఏళ్ల మహిళ ప్లేటు ఫిరాయించింది.

న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్ నాలుగేళ్లపాటు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన 42 ఏళ్ల మహిళ ప్లేటు ఫిరాయించింది. పోలీసులు తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేశారని, సింగ్ తనపై అత్యాచారం చేయలేదని కోర్టుకు తెలియజేసింది. దీంతో నిందితుడు సింగ్ బెయిల్ కోసం దరఖాస్తు చేయగా, దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసుపై అడిషనల్ సెషన్స్ జడ్జి సరితా బీర్బల్ శనివారం రహస్య విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ కొన్ని అపార్థాల కారణంగా తాను సింగ్‌పై ఫిర్యాదు చేశానని, ఆయన తనపై అత్యాచారం చేయలేదని వాంగ్మూలం ఇచ్చింది. శుక్రవారం నాటి విచారణలోనూ ఈమె ఇలాగే మాట్లాడింది.  బంధువులు ఒత్తిడి చేయడం వల్లే గతంలో అత్యాచారం ఆరోపణ చేశానని రైల్వే ఉద్యోగిని కూడా అయిన ఈ వివాహిత తెలిపింది. 
 
 ఎంపీ ధనంజయ్ తన వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడనే భయంతోనే ఫిర్యాదు చేశానని వివరణ ఇచ్చింది. ‘విడాకులు కోరుతూ భర్త 2009లో నోటీసులు పంపడంతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. సింగ్ నాపై అత్యాచారం చేయలేదు. ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం ఇష్టం లేదు’ అని ఆమె కోర్టుకు వివరించింది. ఫిర్యాది మహిళపై ఎంపీ 2005 జూలై నుంచి 2009 మార్చి మధ్య పలుసార్లు అత్యాచారం చేసినట్టు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జనవరి 31న చార్జిషీటు కూడా దాఖలయింది. అత్యాచారం, అసహజ చర్యలు, దాడి, నేరపూరిత బెదిరింపులు తదితర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. సింగ్ తరఫు న్యాయవాది ఈ ఆరోపణలను తిరస్కరించారు. అయితే పనిమనిషిపై వేధింపులు, హత్య కేసులోనూ ధనంజయ్ సింగ్, అతని భార్య జాగృతి గత నవంబర్‌లోనే అరెస్టయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ తీహార్ జైలులో ఉన్నారు. సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement