15రోజులే

Distribution of ration material between 1 and 15th of every month - Sakshi

ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీలోపే రేషన్‌ సరుకుల పంపిణీ

వచ్చే నెల నుంచే అమలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా : చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్‌ కార్డుదారులకు ఇకపై నెలలో 15 రోజులు మాత్రమే సరుకులు అందజేయనున్నారు. వచ్చేనెల నుంచి ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. అప్పటినుంచి ప్రతినెలా ఒకటి నుంచి 15వ తేదీలోపే కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీలర్లకు ఆదేశాలు అందాయి. జిల్లావ్యాప్తంగా 919 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులు కలిపి మొత్తం 5.18 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రతినెలా సుమారు 11 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రతి కార్డుదారుడికి రెండు కిలోల గోధుమలు, ఒక లీటరు నీలి కిరోసిన్‌ చొప్పున పంపిణీ అవుతోంది. మొన్నటి వరకు ప్రతినెలా 25వ తేదీ వరకు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉండేవి. తమ సౌలభ్యాన్ని బట్టి వీలైన రోజు కార్డుదారులు సరుకులను తీసుకెళ్లేవారు. తాజాగా రేషన్‌దుకాణాల పనిదినాలను కుదించడంతో కాస్త ఇబ్బంది కలగవచ్చు.

పని వేళలను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే వచ్చేనెల నుంచి కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచే ఉంటాయని అధికారులు పౌర సరఫరాల శాఖాధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈనెలలోనే ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిత్యావసర వస్తువుల పంపిణీ అమలు కావాల్సి ఉంది. అయితే అధికంగా సెలవులు రావడంతో 17వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేశారు. వచ్చేనెల పని దినాల్లో ఎలాంటి సడలింపు ఉండబోదని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

డీడీల చెల్లింపుల్లోనూ!
రేషన్‌ దుకాణాల పని దినాలను కుదించిన ప్రభుత్వం.. డీలర్లు డీడీలు చెల్లించే రోజులను సైతం తగ్గింది. మొన్నటి వరకు ప్రతినెలా 27వ తేదీలోపు డీడీలు చెల్లించేవారు. ఆ నెలాఖరులోగా సరుకులు డీలర్ల వద్దకు చేరేవి. ఇకపై ఈ పరిస్థితి ఉండదు. ప్రతినెలా తప్పనిసరిగా 16 నుంచి 18వ తేదీలోపే డీడీలు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చెల్లించినదాన్ని బట్టి స్టాక్‌ రిలీజ్‌ ఆర్డర్లను మండల స్థాయి స్టాక్‌ గోదాం (ఎంఎల్‌ఎస్‌)లకు పంపిస్తారు. అక్కడి నుంచి నెలాఖరులోగా డీలర్ల వద్దకు వస్తువులను పంపించాల్సి ఉంటుంది. తదుపరిగా వచ్చే ఒకటో తేదీ నుంచి విధిగా రేషన్‌ దుకాణాల ద్వారా డీలర్లు కార్డుదారులకు సరుకులను పంపిణీ చేస్తారు.

వేతనం ఇవ్వాల్సి వస్తుందనే!
రేషన్‌ దుకాణాల పనిదినాలను కుదించడం వెనుక కుట్ర ఉందని రేషన్‌ డీలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రతి నెలలో 25 రోజులపాటు సరుకులు పంపిణీ చేసేవారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు మొదలు పెట్టడం డీలర్లకు కాస్త ఇబ్బందిగా మారింది. సరుకుల సంఖ్య కుదించడం, ఈ–పోస్‌ మిషన్లు తీసుకురావడం వల్ల తమకు ఏమీ మిగలడంలేదని డీలర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా నెలంతా కష్టపడితే దుకాణాల అద్దె కూడా వెళ్లడంలేదని లబోదిబోమంటున్నారు. ప్రత్యామ్నాయంగా తమకు ప్రతినెలా వేతనాలను చెల్లించాలని డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సరుకుల అమ్మకం ద్వారా వచ్చే కమీషన్లు లేకున్నా.. వేతనం ఇస్తే చాలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దీన్ని సాధించుకునేందుకు నిరవధికంగా దుకాణాలను బంద్‌ చేయాలని కూడా నిర్ణయించారు. ఇలాంటి సమయంలో నెలలో 15 రోజులే దుకాణాలు పనిచేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. తమకు వేతనాలు అందించాలన్న డిమాండ్‌ను నీరుగార్చడంలో భాగంగానే ఈ చర్యలకు ఉపక్రమించారని విమర్శిస్తున్నారు. పనిదినాల కుదింపు వల్ల తమకు వచ్చే నష్టం ఏమీలేదని చెబుతున్నారు.

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top