చెవి తట్టుకోలేదు | Increasing noise in gretar | Sakshi
Sakshi News home page

చెవి తట్టుకోలేదు

Oct 22 2014 2:11 AM | Updated on Sep 2 2017 3:13 PM

చెవి తట్టుకోలేదు

చెవి తట్టుకోలేదు

దీపావళి.... వెలుగు దివ్వెల పండుగ.. ఆకాశంలో రంగుల హరివిల్లులను ఆవిష్కరించే కాంతుల పండుగ..చిన్నా...

* టపాసుల మోతతో అనర్ధం          
* ప్రజల్లో అవగాహన పెరగాలి
* గ్రెటర్‌లో పెరుగుతున్న శబ్దకాలుష్యం         
* కర్ణభేరికి ప్రమాదం

సనత్‌నగర్: దీపావళి.... వెలుగు దివ్వెల పండుగ.. ఆకాశంలో రంగుల హరివిల్లులను ఆవిష్కరించే కాంతుల పండుగ..చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందడోలికల్లో మునిగిపోయే పండుగ..ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. వాయు, శబ్దకాలుష్యంతో ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు శాస్త్రవేత్తలు. ప్రధానంగా శబ్దకాలుష్యం ఎన్నో అనర్ధాలకు కారణమవుతోంది. కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి.
 గ్రేటర్ పరిధిలో కొన్నేళ్లుగా టపాసుల మోతతో వెలువడే శబ్దాల రికార్డులను విశ్లేషిస్తే ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి. 2006లో రియల్‌ఎస్టేట్ బూమ్ పుణ్యమా అని నగరంలో టపాసుల మోత మోగింది. ఆ తరువాత క్రమేపీ 2011 వరకు చప్పుళ్లు తగ్గుముఖం పట్టాయి. తిరిగి రెండేళ్లుగా భారీ శబ్దం వెలువడే టపాసుల పేలుళ్లతో శబ్ద కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది.  

2006-11 వరకు దీపావళి పండుగ వేళల్లో వాయు కాలుష్య స్థాయి విపరీతంగా పెరిగినట్లు పీసీబీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.  2012, 2013 సంవత్సరాల్లో దీపావళి సీజన్‌లో కాలుష్య స్థాయి అనూహ్యంగా పెరిగింది. నిర్దేశిత డెసిబల్స్ కంటే రెట్టింపు స్థాయిలో ధ్వని కాలుష్య ప్రమాణాలు నమోదయ్యాయి. ఈ తీవ్రత ఆరోగ్యానికి చేటు అంటున్నారు పీసీబీ శాస్త్రవేత్తలు. ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన పెరిగితేనే తప్ప శబ్ద కాలుష్యాన్ని నివారించలేమంటున్నారు నిపుణులు
 
శబ్ద కాలుష్యం వల్ల కలిగే అనర్ధాలివే..
ఏకధాటిగా వెలువడే అధిక శబ్దాల కారణంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ప్రమాదకరం.
చిన్న పిల్లల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. చెవిటి వారిగా మారే అవకాశం కూడా ఉంది.
అధిక రక్తపోటు, తలనొప్పి బాధితులకు చికాకు కలిగిస్తుంది.
గాలిలో దట్టమైన పొగ వెలువడడం ద్వారా వృద్ధులు, చిన్న పిల్లల్లో శ్వాస కష్టమవుతుంది.
బ్రాంకైటిస్, సైనసైటిస్, న్యూమోనియా బారిన పడే ప్రమాదం ఉంది.
పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు వంటివి భారీ శబ్దాలకు బెదిరిపోతాయి. వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది.
పక్షులకు ఎంతో హానికరం. ఒక్కోసారి అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది.
 జాగ్రత్తలు..
ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు తక్కువ స్థాయిలో ధ్వనులు వెలువరించే టపాసులను కాల్చి...సాయంత్రం వెలుగులు ఇచ్చే టపాసులకు ప్రాధాన్యం ఇవ్వాలి
దీపావళి ధ్వని కాలుష్యంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. శబ్ద కాలుష్యం వల్ల కలిగే నష్టాలను తెలియపరచాలని టీఎస్‌పీసీబీ సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement