నోట్ల మార్పిడి కేసులో సీఐ అరెస్టు | CI arrest in the case of currency exchange | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి కేసులో సీఐ అరెస్టు

Dec 14 2016 4:13 AM | Updated on Aug 21 2018 5:51 PM

నోట్ల మార్పిడి కేసులో సీఐ అరెస్టు - Sakshi

నోట్ల మార్పిడి కేసులో సీఐ అరెస్టు

ఓ పోలీసు అధికారే.. ఘరానా మోసగాడిగా మారి లక్షలు కాజేసిన కేసును పోలీసులు ఛేదించారు.

- మరో 10 మంది నిందితులు కూడా..
- రూ.52 లక్షల కొత్త కరెన్సీ, 2 కార్లు,7 సెల్‌ఫోన్లు, బొమ్మ తుపాకీ స్వాధీనం


హైదరాబాద్‌: ఓ పోలీసు అధికారే.. ఘరానా మోసగాడిగా మారి లక్షలు కాజేసిన కేసును పోలీసులు ఛేదించారు. సీఐతో సహా 11 మందిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.52 లక్షల కొత్త కరెన్సీతో పాటు రెండు కార్లు, ఒక బొమ్మ తుపాకీ, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత పెద్దముక్కుళ్ల తిరుమలేష్‌నాయుడు.. టప్పాచ బుత్ర అదనపు ఇన్‌స్పెక్టర్‌ ఎర్రంశెట్టి రాజశేఖర్‌ కలసి పక్కా పథకాన్ని రూపొందించారు. తమ వద్ద పాత కరెన్సీ ఉందని.. కొత్త నోట్లు కావాలని, దీనికి కొంత కమీషన్‌ కూడా ఇస్తామంటూ కొందరు వ్యాపారులను ఫిలింనగర్‌లోని గెస్ట్‌హౌజ్‌కు రప్పించారు. సరిగ్గా నోట్లు మార్చుకునే సమయంలో సీఐ రాజశేఖర్‌ యూనిఫాంలో వెళ్లి తుపాకితో బెదిరించి రూ.2 వేల నోట్ల కొత్త కరెన్సీతో పాటు రూ.78 లక్షలు దోచుకెళ్లారు. ఆ సొమ్మును తిరుమలేశ్‌కు అప్పజెప్పాడు.

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మండలానికి చెందిన ఎయిర్‌టెల్‌ డిస్ట్రిబ్యూటర్‌ లక్ష్మణ్‌ అగర్వాల్‌ ఈ నెల 1న కొత్త కరెన్సీ మార్చుకునే క్రమంలో తిరుమలేశ్‌ మాటలు నమ్మి ఫిలింనగర్‌ గెస్ట్‌హౌజ్‌కు వచ్చాడు. ఆయనతో పాటు గద్వాల్‌ జోగులాంబ కొంకాల గ్రామానికి చెందిన సంకి మాణిక్యరెడ్డి, అంబటి వెంకటేశ్‌బాబు కూడా 38 లక్షలు తీసుకురాగా ఆ మొత్తాన్ని కూడా రాజశేఖర్‌ బెదిరించి తీసుకెళ్లాడు. తమ డబ్బులు ఏమయ్యాయో తెలియని బాధితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకొని వీరి నుంచి రూ.52 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పి.తిరుమలేశ్‌నాయడు, సీఐ రాజశేఖర్, ఎర్ర అనిల్‌కుమార్‌ అలియాస్‌ అప్పు, అల్లరి ప్రవీణ్‌కుమార్, గానుగు బాలకృష్ణ, చవకుల రాజు, ఇంద్రి ఆనంద్, రామగిరి ప్రవీణ్, కొండరాజులు సాయికుమార్, మేగావత్‌ రాజులపై ఐపీసీ సెక్షన్‌ 395 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నరేశ్, దినకర్, ప్రవీణ్, మద్దెల సంతోష్, శ్రీకాంత్, ఖాజా, వై.నర్సింగ్‌రావు అలియాస్‌ చిన్నన్న పరారీలో ఉన్నారు. పరారీలోని నిందితుల వద్ద రూ.16 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది.

డబ్బు పంపకాలు ఎన్బీటీ నగర్‌లోనే...
బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని ఎన్బీటీ నగర్‌లో తన కార్యాలయంలో ఉండి ఫోన్ల ద్వారానే తిరుమలేశ్‌నాయుడు ఈ బందిపోటు ముఠాకు నాయకత్వం వహించి పథకం ప్రకారం డబ్బులు చోరీ చేసే విధంగా రాజశేఖర్‌కు ఆదేశాలు ఇచ్చాడు. తస్కరించిన సొమ్మును రాజశేఖర్‌ ఎన్బీటీ నగర్‌కు తీసుకొచ్చాడు. అక్కడే అనుచరులందరికీ తిరుమలేశ్‌ డబ్బులు పంపిణీ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement