పండగ ధగధగ

పండగ ధగధగ - Sakshi


 సినిమా పరిభాషలో పండగ అంటే సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి. ఏం చేసినా.. ఏం పీకినా.. కెమెరా ఫోకస్ ఎటు తిప్పినా.. సెన్సార్ బోర్డు ఎన్ని కట్‌లు చెప్పినా.. ఎడిటర్ ఎన్ని కుట్లు వేసినా.. అందరి పరుగూ ఈ నాలుగు స్తంభాలాటలోనే. సినీ కళామతల్లి కోసం కట్టిన గుడికి ఈ నాలుగు పండగలూ నాలుగు స్తంభాలు. హీరోల దగ్గర్నుంచి అభిమానుల వరకూ అందరూ పూజించేది ఈ గుడిలోనే. అందరూ చేసుకునేది ఈ నాలుగు పండగలే. దీపావళి గడప దగ్గర నిలబడి ‘ఫన్‌డే’ పాఠకులకు నాలుగు పండగల సినిమాల విశేషాలు చెప్పాలని ఈ స్పెషల్ సినిమా ప్రివ్యూ మీకోసం..

 

 ఒకరిది ప్రేమ.. ఇంకొకరిది పగ.. మరొకరిది సోకు... ఇంకొకరిది వినోదం. ప్రేమ గెలిచింది. పగ కూడా గెలిచింది. సోకు సూపర్ అనిపించుకుంది. వినోదం కాలరెగరేసింది. సంక్రాంతి రేసులోకి ముగ్గుల పోటీల్లా దూసుకొచ్చిన  ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ పండగ సెలవులను బాగానే క్యాష్ చేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ కలక్షన్స్, ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్ సేల్స్, డబ్బింగ్ రైట్స్ తదితర అమ్మకాలన్నీ కలుపుకుని నాలుగు గొబ్బెమ్మలూ ‘ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్’ అయ్యాయి.

 

 ప్రేక్షకుల ప్రేమతో...

 సంక్రాంతి పండగ మొదటి రోజు భోగి కానుకగా వచ్చిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌తో సుకుమార్ దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది.  ‘మంచి ఎమోషనల్ మూవీ’ అనిపించుకుంది. హాలీవుడ్ స్థాయిలో ఉందనే టాక్‌నూ సొంతం చేసుకుంది. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టార్ అయిన సుకుమార్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌ని కూడా లెక్క ప్రకారం తీశారు. సినిమాలో ఎన్ని లెక్కలున్నా వసూళ్లు సాదాసీదాగా ఉంటాయన్నది కొందరి లెక్క. అయితే లెక్క తప్పింది. ప్రేక్షకుల ప్రేమతో బాక్సాఫీస్ లెక్కలు కూడా బాగానే ఉన్నాయి.

 బడ్జెట్: రూ.60 కోట్లు, మొత్తం వసూళ్లు: రూ.70 కోట్లు (రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ కలెక్షన్స్ - రూ.40 కోట్లు)

 

 కలిసొచ్చిన సంక్రాంతి

 గడచిన 20 ఏళ్లల్లో బాలకృష్ణ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సంక్రాంతికి విడుదలైనవే. దాంతో సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అయిన ‘డిక్టేటర్’పై సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. దర్శకత్వం వహించడంతో పాటు ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి శ్రీవాస్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగి, బాగానే వసూళ్లు రాబట్టుకోగలిగింది.

 బడ్జెట్: రూ.30 కోట్లు, మొత్తం వసూళ్లు: రూ.35 కోట్లు (రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ వసూళ్లు రూ.20 కోట్లు)

 

 రాజాకి తిరుగులేదు

 శర్వానంద్‌కి మినిమమ్ గ్యారంటీ హీరో ప్లస్ కొత్త రకం సినిమాలు ట్రై చేస్తాడనే పేరుంది. ‘రన్ రాజా రాజా’ హిట్టయిన తర్వాత ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అంటూ సంక్రాంతికి సందడి చేయడానికి దూసుకొచ్చాడు. బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్‌లు చేసినవి భారీ

 బడ్జెట్ చిత్రాలు. వాటితో పోల్చుకుంటే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చాలా చిన్న బడ్జెట్. కానీ, మంచి వసూళ్లతో కింగ్ అనిపించుకున్నాడు. బడ్జెట్ రూ.8 కోట్లు, మొత్తం వసూళ్లు: రూ.20 కోట్లు (రెండు తెలుగు రాష్ట్రాల టికెట్ కలక్షన్స్ రూ.12 కోట్లు)

 

 సోగ్గాడు అదిరిపోయాడు

 సంక్రాంతి అంటే పల్లెలన్నీ కళకళలాడతాయ్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ఆ కళ కనిపించింది. ‘వాసివాడి తస్సదియ్యా’ అంటూ తనకే మాత్రం అలవాటు లేని పదాలతో నాగార్జున చేసిన సందడి అందర్నీ ఆకట్టుకుంది. అందుకే సోగ్గాడు వీర విహారం చేశాడు. వసూళ్లు పరంగా దుమ్ము దులిపేశాడు.

 బడ్జెట్: రూ.18 కోట్లు, వసూళ్లు: రూ.60 కోట్లకు పైనే (టికెట్ కలక్షన్స్ రూ.40 కోట్లు)

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top