హ్యూమరం: వైరాగ్య కిరణం | kirankumar reddy's dispassion | Sakshi
Sakshi News home page

హ్యూమరం: వైరాగ్య కిరణం

Sep 8 2013 2:28 AM | Updated on Jul 29 2019 5:31 PM

హ్యూమరం: వైరాగ్య కిరణం - Sakshi

హ్యూమరం: వైరాగ్య కిరణం

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్: ‘‘రాష్ట్రంలో పరిస్థితులెలా ఉన్నాయి?’’ విలేకరుల ప్రశ్న. ‘‘స్థితి నుంచి పరిస్థితి, పరిస్థితి నుంచి సంకట స్థితి, దుస్థితి, చివరికి యధాతథస్థితి వస్తాయి.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్:  ‘‘రాష్ట్రంలో పరిస్థితులెలా ఉన్నాయి?’’ విలేకరుల ప్రశ్న.  ‘‘స్థితి నుంచి పరిస్థితి, పరిస్థితి నుంచి సంకట స్థితి, దుస్థితి, చివరికి యధాతథస్థితి వస్తాయి. ఉన్న పరిస్థితులను చెడగొట్టడం, తిరిగి బాగుచేయడం. దీన్ని స్థితి స్థాపక శక్తి అంటారు. శాంతిని పాడుచేసి భద్రత కల్పించడం, భద్రత లేకుండా చేసి శాంతికోసం వెతకడం; దీన్ని లా అండ్ ఆర్డర్ అంటారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందుగలడందులేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అధిష్టానమే కదా.’’
 ‘‘మేం అడిగిందేమిటి? మీరు చెప్పిందేమిటి?’’ తికమకపడ్డారు విలేకరులు.
 ‘‘అడుగడుగున గుడి ఉంది. అందరిలో గుడి ఉంది.’’
 ‘‘కొంపదీసి బీజేపీలో చేరతారా ఏమిటి?’’
 ‘‘ఏ పార్టీకైనా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్లు అనుకుంటే మనకు సెలవిప్పిస్తారు.’’
 ‘‘వెకేషన్ వెళుతున్నారా?’’
 ‘‘వెకేషన్, అకేషన్, సఫకేషన్, ఎలెక్ట్రిఫికేషన్... ఎవ్వనిచే జనించు అధిష్టానం.’’
 ‘‘అన్నింటికీ అధిష్టానమేనా? మీరు సొంతంగా మాట్లాడరా?’’
 ‘‘సొంతంగా చేస్తే పంతమంటారు. పంతంగా చేస్తే ఇంటికి పదమంటారు. ఢిల్లీ కంటే ఇల్లే పదిలం.’’
 ‘‘రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’
 ‘‘ఢిల్లీ లొల్లి.’’
 ‘‘మీరూ చంద్రబాబు కుమ్మక్కయ్యారట.’’
 ‘‘ఇద్దరం ఒకే పడవలో ఉన్నాం. మునగక తప్పదని నాకు తెలుసు. బాబుకి తెలిసినా గజఈతగాడిలా బస్సుయాత్రకు బయలుదేరాడు. బస్సుతో జనం కస్సుబుస్సు తగ్గేనా? అంతా బుస్సు. చత్వారమొచ్చిన తర్వాత రెండు కళ్లయినా ఒకటే, నాలుగు కళ్లయినా ఒకటే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు...’’ అని కిరణ్ పాట ఎత్తుకున్నాడు.
 ఇంతలో పీఏ వచ్చి చెవిలో ఏదో చెప్పాడు.
 ‘‘ఢిల్లీకి రమ్మని పిలుపు. ఎందుకు పిలుస్తారో వాళ్లకూ తెలియదు. ఎందుకు పోతానో నాకూ తెలియదు. అయిననూ పోయి రావలె హస్తినకు.’’
 ‘‘మీ సంగతి సరే. ప్రజల పరిస్థితి ఏమిటి?’’
 ‘‘ఒక్కండు మీ మొర ఆలకించడు. పొగ పెట్టారు. సెగ చుట్టుకుంది. బాల్ పట్టుకుని జనం కాచుకు కూచున్నారు. ఎన్నికలొస్తే అవుట్ చేయటానికి. అవుట్లు కాల్చడానికి...’’
 ‘‘ప్రజలకు మీరిచ్చే సందేశం?’’
 ‘‘గెడకర్ర లేకుండా తీగపై నడవడం ప్రాక్టీస్ చేయమని!’’
 -  జి.ఆర్.మహర్షి
 
 మహర్షిజం
 తెలుగు తమ్ముడి ఆవేదన:
 ముందుచూపుతో ఉన్న చూపుని పోగొట్టుకున్నాడు మా చంద్రబాబు.
 మనదేశంలో మనుషులకే కాదు, డబ్బుకీ జబ్బు చేస్తుంది.
  మిణుగురులతో చీకటిని పారదోలడమే రాజకీయం.
 కాంగ్రెస్ నాయకుడి కామెంట్: మావాళ్లు చేపలకు వలేసి తామే వలలో చిక్కుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement