ఆదరించిన ఊరును ఆదుకున్న నేస్తం

ఆదరించిన ఊరును ఆదుకున్న నేస్తం - Sakshi


నేపాల్‌లోని ‘టెచో' గ్రామానికి హెచ్‌సీయూ విద్యార్థుల అండ

తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు సాయం
నేపాల్ భూకంపం.. ప్రతి మనిషిని కదిలించిన, కలచివేసిన ఉపద్రవం. ఈ వైపరీత్యం తర్వాత ఆ దేశాన్ని చూసి ‘ఆయ్యో పాపం’ అనుకున్నవారు ఉన్నారు. ఆదుకునేందుకు ముందుకు వచ్చినవారూ ఉన్నారు. రెండేళ్ల క్రితం చదువులో భాగంగా నేపాల్ వెళ్లిన ఓ హైదరాబాద్ కుర్రాడు తనకు ఆశ్రయమిచ్చిన గ్రామానికి సాయం చేయడానికి ఉద్యమించాడు. స్నేహితుల సాయంతో విరాళాలు సేకరించి భూకంపంలో నేలమట్టమైన ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేశాడు.ఇందుకు తానే స్వయంగా అక్కడకు వెళ్లి ప్రతి రూపాయి బాధితులకు అందేలా చూశాడు. ఆ యువకుడి పేరు ‘సిపాయి సర్వేశ్వర్’. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ఆంత్రోపాలజీ విద్యార్థి. ఇతడికి స్నేహితులు, వారి స్నేహితులు, ప్రొఫెసర్లు బాసటగా నిలిచారు. ఈ మహా యజ్ఞంలో మరో హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి, బీహార్ వాసి నీలేశ్, ఢిల్లీ జేఎన్‌యూ పీహెచ్‌డీ విద్యార్థి హైదరాబాద్ వాసి గరిమెళ్ల సురేశ్ పాలుపంచుకున్నారు.  

- సాక్షి, సిటీబ్యూరో

 

నివాసాల కోసం..


‘విరాళాల సేకరణ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించాం. భోజ్‌పురి, ఫోక్ సాంగ్స్ పాడాం. నేపాల్ బాధితులకు చేయూతనిచ్చేందుకు హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా మేం రూ. 5.50 లక్షలు సేకరించాం. (నేపాల్ కరెన్సీలో 8.80 లక్షలు) ఆ డబ్బుతో మే 23న హైదరాబాద్ బస్సులో నేపాల్‌లోని టెచో గ్రామానికి చేరుకున్నాం. అక్కడి హపఫుచ ఆర్గనైజేషన్‌తో కలిసి ఏం చేయాలనేదానిపై చర్చించాం. అక్కడి విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌తో కలిసి సర్వే చేస్తే మొత్తం 2543 ఇళ్లు ఉన్న గ్రామంలో 550 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయం అందని 230 కుటుంబాలను గుర్తించాం.అక్కడివారికి తిండి, దుస్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కో టెంట్ కింద రెండు, మూడు కుటుంబాలు ఉంటున్నాయి. వచ్చేది వానాకాలం.. బాధితులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు అవసరం. ఇతర సంస్థలు వెదురు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. బహిరంగ ప్రాంతాల మరమ్మతు కోసం రూ.90 వేలు మినహా మిగతా డబ్బుతో సీజీఐ షీట్స్ కొని తాత్కాలిక నివాసాల నిర్మాణ ం చేపట్టాం. ఇలా ఒక్కో ఇంటికి రూ. 3,434 ఖర్చు చేశాం’ అవి వివరించారు.

 

మళ్లీ వెళ్తాం..


‘నేపాల్‌లో చేయాల్సిన సహాయక కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. మేం రెండో విడత విరాళాలు సేకరించాలనుకుంటున్నాం. నేపాల్ నుంచి ‘సెవెన్ వండర్స్ బ్యాండ్’ను హైదరాబాద్‌కు రప్పిస్తున్నాం. వీరితో ఇక్కడ షోలు నిర్వహించి వచ్చిన డబ్బుతో అక్కడ సాయం చేస్తాం. నేపాల్ కల్చరల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అక్కడి నుంచి చెఫ్‌లను తీసుకొస్తున్నాం. వాటితో వచ్చిన డబ్బుతో టెచో గ్రామ రూపు రేఖలు మార్చుతాం’ అంటూ వివరించాడు సర్వేశ్.

 

ఫేస్‌బుక్ సాయం..

ఆంత్రోపాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న సర్వేశ్ ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా 2013లో నేపాల్‌లోని లలిత్‌పూర్ జిల్లా ‘టెచో’ గ్రామానికి వెళ్లాడు. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడి ప్రజలతో మమేకమై వారి వారి జీవన విధానం, సమస్యలపై పరిశోధన చేశాడు. ఈ సమయంలో స్థానిక ‘హపఫుచ వలంటరీ యూత్ ఆర్గనైజేషన్’తో పరిచయం ఏర్పడింది. ఇటీవల నేపాల్‌లో భూకంపంలో ఈ గ్రామం కూడా దెబ్బతింది. ఇళ్లు, తిండి లేక ఈ గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు.దీంతో ఈగ్రామానికి చెందిన లెక్చరర్ మహేశ్ ‘మా గ్రామస్తులను ఆదుకోండి’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇది చదివి చలించిన సర్వేశ్ తాను ఫీల్డ్‌వర్క్ చేసిన ఆ గ్రామానికి చేయూతనివ్వాలనుకున్నాడు. విషయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. విరాళాల సేకరణకు ఫేస్‌బుక్‌లో పేజీ క్రియేట్ చేశాడు. దాదాపు 700 మందికి పైగా సభ్యులుగా చేరి విరాళాల సేకరణలోనూ భాగమయ్యారు. ఫ్రెండ్స్, ఫ్రొఫెసర్లు.. ఇలా అందరూ తమకు తోచిన ఆర్థిక సాయం చేశారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top