కండ్లకలక తగ్గడం ఎలా...?

కండ్లకలక తగ్గడం ఎలా...?


నా వయసు 55. ప్రతి ఏడాదీ శీతకాలంలో నాకు కండ్లకలక వస్తుంటుంది. పుసులు కట్టి కండ్లు అంటుకోవడం, ఎర్రబడటం, సూర్యరశ్మి చూడలేకపోవడం వంటి లక్షణాలుంటాయి. దీని నిర్మూలనకు ఆయుర్వేద సూచనలు ఇవ్వండి.

 పి. రాధాస్వామి, చిత్తూరు


 

 కండ్లకలక (కంజెక్టివైటిస్)ను ఆయుర్వేదం ‘అభిష్మంద’ వ్యాధిగా వర్ణించింది. దోష ప్రాబల్యాన్ని బట్టి ఇది ‘వాత, పిత్త, కఫ, రక్త’ భేదాలుగా వర్గీకృతమైంది. వైరస్, బాక్టీరియా వంటి సూకా్ష్మంగ క్రిములు, అలర్జీ (అసాత్మ్యత) దీనికి ప్రధాన కారణాలు. ఇది ఒకరినుంచి మరొకరికి వ్యాపించే సాంక్రమిక వ్యాధి. సాధ్యమైనంత వరకు కంటిని అపరిశుభ్ర వాతావరణానికి దూరంగా ఉంచాలి. చేతివేళ్లతో కళ్లు నులుపుకోవడం వంటివి చేయకూడదు. ప్రతివ్యక్తికి ఉండే క్షమత్వశక్తినీ, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను బట్టి ఈ వ్యాధి సోకడమనేది ఆధారపడి ఉంటుంది. ఈ రోగం ఉన్న వ్యక్తులకు కాస్త దూరంగా మెలగాలి. శుభ్రభస్మం (ఏలం/పటిక) నీళ్లలో మరగబెట్టి, చల్లార్చి, పరిశుభ్రంగా పదిలపరచుకొని, రెండేసి చుక్కలు రెండు కళ్లలోనూ వేసుకోవాలి. ఇది కంటికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. అభిష్యందవ్యాధి ఉన్న రోగులు, గోరువెచ్చని నీళ్లతో కండ్లను శుభ్రపరచుకొని మెత్తటి, శుభ్రమైన రుమాలుతో తుడుచుకోవాలి. ‘ఆఫ్తాకేర్, ఐటోన్’ వంటి ఆయుర్వేద కంటిచుక్కలు మందుల షాపుల్లో లభిస్తాయి. రెండేసి చుక్కల చొప్పులన రెండు కళ్లలోనూ మూడుపూటలా వాడాలి. ‘గంధకరసాయన మరియు లఘుసూతశేఖర రస’ మాత్రలను పూటకు రెండేసి చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు,  పులుపు, కారం తక్కువగా తీసుకుంటూ, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.

 

 నా వయసు 62. నాకు రాత్రిపూట మూత్రం ఎక్కువసార్లు వస్తుంటుంది. డాక్టర్లు పరీక్ష చేసి షుగరు వ్యాధి లేదన్నారు. కానీ ప్రోస్టేట్ గ్రంధి వాపు వల్ల ఈ సమస్య కలిగిందన్నారు. ఇది తగ్గడానికి మందులు తెలియజేయ ప్రార్థన.

 - ఆర్. బసవలింగం, అనంతపురం


 

 ప్రోస్టేట్ గ్లాండ్‌ను ఆయుర్వేద పరిభాషలో ‘పౌరుషగ్రంధి’ అంటారు. ఇది కేవలం పురుషుల్లో మాత్రమే ఉంటుంది. వయసు పైబడిన వారిలో ఇది కొద్దిగా పరిమాణం పెరగడం సహజం. దానివల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మూత్రం మాటిమాటికీ వస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ గ్రంధికి ఇన్ఫెక్షనూ సోకవచ్చు. కొందరిలో ఈ వాపు క్యాన్సరుగా పరిణమించవచ్చు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ దిగువ సూచించిన మందుల్ని రెండు నెలల పాటు వాడి పరిస్థితిని సమీక్షించుకోండి.

 

 సప్తవింశతి గుగ్గులు (మాత్రలు)    ---    ఉదయం 2, రాత్రి 2

 

 చంద్రప్రభావటి (మాత్రలు)    ---    ఉదయం 2, రాత్రి 2

 

  చందనాసవ (ద్రావకం):  నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి మూడుపూటలా తాగాలి.

 

 నా వయసు 23. తరచూ తలలో పేలు బాధిస్తున్నాయి. దీనికి మందు చెప్పండి.

 - కె. అంజనీబాయి, కరీంనగర్


 

 శిరోజాలలో మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా ఉంటే తలకు పేలుపట్టే పరిస్థితి రాదు. ప్రతిరాత్రి ‘నింబతైలం’ (వేపనూనె) తలకు రాసుకుని, మరుసటిదినం కుంకుడుకాయ చూర్ణంతో తలస్నానం చేయండి. సీతాఫలాల్లోని గింజల్ని ఎండబెట్టి, పొడిచేసి, ఆ చూర్ణాన్ని నీళ్లలో ముద్దగా చేసి రోజు విడిచి రోజు శిరోజాలకు పట్టించండి. పదిరోజుల్లో ఫలితం కనిపిస్తుంది. ‘కుమార్యాసవ’ ద్రావకాన్ని ఉదయం, రాత్రి నాలుగేసి చెంచాలు... సమానంగా నీళ్లు కలిపి ఒక నెలపాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

 

 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి

 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),

 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,

 హుమయున్ నగర్, హైదరాబాద్


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top