సంక్షేమంలో సూపర్‌ సిక్సర్‌

YS Jagan Mohan Reddy Six Months Welfare Schemes In YSR Kadapa - Sakshi

ఆరు నెలల్లోనే ఎన్నో పథకాలకు శ్రీకారం

వైఎస్‌కు తగ్గ తనయుడిగా ముందంజ

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు జనం జేజేలు 

సాక్షి, కడప : ఆరు నెలల కాలంలోనే ఎవ్వరికీ సాధ్యం కాని హామీలు, పథకాలను అమలు చేసి వైఎస్‌ జగన్‌ సర్కారు సంక్షేమంలో దూసుకెళుతోంది. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీలనే కాక కొత్త పథకాలను ప్రవేశపెడుతూ అందరి మన్ననలు అందుకుంటోంది. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ, బీసీ, అన్ని రంగాల వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. విద్య, వైద్య, ఉపాధిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.  తొలి నుంచే ఇచ్చిన హామీలను అమలు చేస్తాం.. మాటకు కట్టుబడి ఉంటాం అని నిరూపిస్తోంది. అన్నమాట ప్రకారం అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించి, ఆర్థికాభివృద్ధి సాధించాలన్న ధ్యేయంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొలువుదీరి నేటితో ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా లబ్ధి పొందిన వారి మనోగతం వారి   మాటల్లోనే..

1. జిల్లాలో 18,300 మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ. 13.18 కోట్లు  
2. రైతు భరోసా కింద మొత్తం రైతులు 4,17,635 మంది ఉండగా, ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 13,500 చొప్పున పంపిణీ. రూ. 5,63,80,71,500 రైతులకు చెల్లించారు. 
3. ఆటో, ట్యాక్సీవాలాలకు ఏడాదికి రూ. 10 వేలు ఇస్తానని ప్రకటించారు. 38 వేల మందికి ఆటో, మ్యాక్సీ క్యాబ్‌లకు రూ. 38 కోట్లు అందించారు. 
4. జిల్లాలో 23 వేల చేనేత మగ్గాలు, 35 వేల చేనేత కుటుంబాలు, 6416 మంది అనుబంధ కార్మికులు ఉన్నారు. ఏడాదికి ప్రతి కుటుంబానికి రూ. 24 వేలు చొప్పున రూ. 55.20 కోట్లు ఇవ్వనుంది. 
5. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ. 10 వేలు చొప్పున అందివ్వనుంది. మొత్తం 11,500 మందికి రూ. 11.50 కోట్లు ఇవ్వనున్నారు. 
6. అమ్మ ఒడి పథకం కింద మొత్తం 4,86,040 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి రూ. 729 కోట్లు విద్యార్థుల తల్లుల పేరున జమ చేయనుంది.  
7. జిల్లాలో 584 మంది ఇమామ్‌లు, మౌజన్లు ఉన్నారు. వీరికి గౌరవ వేతనాన్ని ఇవ్వనుంది. మొత్తం రూ. 87,60,000 ఇవ్వనున్నారు.  
8. జిల్లాలోని 789 గ్రామ పంచాయతీల పరిధిలో 15167 వలంటీర్‌ ఉద్యోగాలు, మరో ఎనిమిది వేల మందికి సచివాలయ ఉద్యోగాలను కల్పించారు. వీరికి నెలకు రూ. 12,75,835 చెల్లిస్తోంది. 
9. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలో డ్రైవర్లు, కండక్టర్లతోపాటు అన్ని రకాల ఉద్యోగులు 3313 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. 
10. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల కోసం ఫిబ్రవరి నుంచి వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద మైనార్టీలు, ఎస్టీ ఎస్టీల్లోని యువతుల వివాహాలకు రూ. లక్ష చొప్పున, బీసీ యువతుల వివాహాలకు రూ. 50 వేలు చొప్పున అందజేయనున్నారు. 
11. వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ద్వారా 4,29,917 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో కంటి జబ్బులున్న వారికి అద్దాలను పంపిణీ చేయడంతోపాటు అవసరమైన వారికి సర్జరీలు చేయనున్నారు. మూడవ విడతలో జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు చేయనున్నారు.  
 12. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతోపాటు ప్రభుత్వం ఇల్లు కట్టించేందకు సిద్దమైంది. లబ్ధిదారులను ఎంపిక చేసి వారి కోసం ఇప్పటికే 3500 ఎకరాల స్థలాలను అధికారులు గుర్తించారు. 
13.  జిల్లాలో పనిచేస్తున్న 2450 మంది ఆశా వర్కర్ల జీతాలను ప్రభుత్వం రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచింది. నెలకు రూ. 2.45 కోట్లు ఇస్తోంది. 
14. జిల్లాలో 3,00,840 మంది వివిధ రకాల పెన్షన్‌దారులు ఉండగా, వీరికి పెన్షన్‌ మొత్తాన్ని రూ. 2250 నుంచి రూ. 10,000కు పెంచి రూ. 72,73,29,750 ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 
 15. జిల్లాలో 6900 మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారు. వీరి జీతాలను ప్రభుత్వం పెంచి నెలకు రూ. 6.36 కోట్లు చెల్లిస్తోంది. 
16. జిల్లాలో 5920 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. వీరి వేతనాలను రూ. 1000 నుంచి రూ. 3000లకు పెంచారు. నెలకు రూ. 1,77,60,000 చెల్లిస్తోంది.  
17. జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో 4045 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి జీతాలు రూ. 12000 నుంచి రూ. 18000లకు పెంచారు. నెలకు రూ. 7,28,10,000 చొప్పున చెల్లిస్తోంది.  

రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు  
జిల్లాలో సంక్షేమంతోపాటు వేల కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపడుతోంది. కడప, పులివెందుల అభివృద్ధికి రూ. 250 కోట్లు బడ్జెట్‌లోనే కేటాయించిన ప్రభుత్వం గాలేరు–నగరి, కుందూ నది పరిధిలో రూ. 4530 కోట్లతో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయనుంది. కడప స్డీల్‌ ప్లాంటుకు డిసెంబరు 26న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కడప రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. పులివెందులతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు.

వైఎస్సార్‌ రైతు భరోసా​:  నా పేరు దండుబోయిన గంగాధరయాదవ్‌. మాది వేముల మండలం, రాచకుంటపల్లె గ్రామం. నాకు ఎకరా పొలం ఉంది వైఎస్సార్‌ రైతు భరోసా కింద దరఖాస్తు చేసుకున్నాను.   వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో భాగంగా రూ.9500 నగదు నా ఖాతాలో జమ చేశారు. గత ప్రభుత్వంలో వానలు కురవక పంటలు ఎండిపోతే ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. పంటల బీమా కూడా రాలేదు. ఈ ప్రభుత్వంలో  వైఎస్సార్‌ రైతు భరోసా డబ్బులు బాగా ఉపయోగపడ్డాయి. రూపాయి బీమా కూడా మాలాంటి చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగం. ఈ ప్రభుత్వానికి అన్నదాతలు రుణపడి ఉంటారు.  

వైఎస్సార్‌  ఆసరా: నా పేరు లీలావతి. మాది పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ గిరినగర్‌. నేను డ్వాక్రా రుణంతో స్వీట్లు తయారు చేసి అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నా. గత ఎన్నికల కంటే మా సంఘం తరఫున ముందు రూ.3.37 లక్షల రుణాన్ని తీసుకున్నాం. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక వైఎస్సార్‌ ఆసరా కింద మాకు రుణమాఫీ అర్హత లభించింది. ఒక్కో మహిళకు రూ.34వేలు అందనుంది. నాలుగేళ్లలో ఈ మొత్తం అందుతుంది. ఈ నగదుతో నాకు ఉన్న వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకుంటాను. వడ్డీ రుణమాఫీ కింద సంఘానికి రూ.34500ను ప్రభుత్వం మంజూరు చేసింది.

అమ్మఒడి: నా పేరు బీచు వెంకటసుబ్బారెడ్డి. మాది ఖాజీపేట మండలం కూనవారిపల్లె. నేను సన్నకారు రైతును. నాకు ముగ్గరు పిల్లలు. మొదటి అమ్మాయి చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటుంది. రెండవ కుమారుడు డిగ్రీ చేస్తున్నాడు. మూడవ కుమార్తె పదో తరగతి చదువుతుంది. నాకు పైరు ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబ పోషణ చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. ముఖ్యమంత్రి  ప్రవేశ పెట్టిన జగనన్న అమ్మఒడి ద్వారా  రూ. 15 వేలు మా భార్య ఖాతాలో పడనుంది.  నా పిల్లల చదువుకు ఎంతగానే ఉపయోగపడుతుంది.       సీఎంకు కృతజ్ఞతలు

 అగ్రి గోల్డ్‌: నా పేరు ఎం.రాజమ్మ, మాది నందలూరు. 2012లో అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. నాతో పాటు మా సంబంధీకులు కూడా అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేశారు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. గత ఐదేళ్లుగా మా డబ్బులు వస్తాయో రావో అని ఎదురుచూసాం. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాగానే మాలో ఆశలు చిగురించాయి. ఆయనపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు. అనుకున్నట్లుగానే మొదటవిడతో మా ఖాతాలో రూ. పది వేలు జమ చేశారు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. అలాగే మిగిలిన వారికి కూడా అగ్రిగోల్డ్‌కు సంబంధించిన డబ్బులు వస్తాయనే నమ్మకం పెరిగింది.  

మన బడి నాడు - నేడు: ఈయన పేరు ఎం. మల్లేశ్వరుడు. కమలాపురంలోని ఎంపీపీ మెయిన్‌ పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తే వారు బాగా చదవడానికి వీలు ఉంటుందని చెబుతున్నారు. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం కృషి చేయడం హర్షణీయమని పేర్కొంటున్నారు. దాంతో ఏకాగ్రత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు అన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుండడంతో సమస్యలు తీరుతాయంటున్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, మంచి ఫలితాలు సాధిస్తారని చెబుతున్నారు.    

ఆరోగ్య శ్రీ: నాపేరు చీలి సుబ్బరాయుడు. నాది రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామం. నేను వృత్తిరీత్యా వ్యవసాయం చేసుకుంటూ, బేల్దారి పనికి వెళ్లేవాడిని. అయితే నాకు ముక్కులో గడ్డ ఉండటంతో ఇక్కడి వైద్యులు తిరుపతికి వెళ్లాలని సూచించారు. రాజుపాళెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఆరోగ్య మిత్ర సహదేవుడు సహాయంతో గత సెప్టెంబరు 19వ తేదీన తిరుపతిలోని స్విమ్స్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నాను. దాదాపు రూ.లక్షా 18 వేలు ఖర్చు అయ్యింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో అంతా ఉచితంగానే చేశారు. ప్రభుత్వం అందించిన ఆరోగ్యశ్రీ కార్డు ఎంతగానో ఆదుకుంది. ప్రస్తుతం నేను అన్నం బాగానే తింటూ ఆరోగ్యంగా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

ఇళ్లపట్టాలు: ఈమె పేరు మారెళ్ల సునీత. అంకమ్మనగర్, రైల్వేకోడూరు పట్టణం. కొనేళ్లుగా ఇంటిస్థలం కోసం కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేది లేక బాడుగ ఇంటిలోనే ఉంటోంది. భర్త ప్రభాకర్‌ పెయింట్‌ ఆర్టిస్ట్‌. తన భర్త సంపాదనతోనే కుటుంబం నడవాల్సిన దుస్థితి. ప్రస్తుత ప్రభుత్వం ఉగాదికి నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేయనుంది. ఇన్నాళ్లకు తమ కల నెరవేరుతుందని, మాగోడు చూసి ఆ దేవుడే గూడు చూపాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ\ వార్డు సచివాలయాలు:  ఇతని పేరు ఎం.వెంకట సురేష్‌. పెద్దముడియం మండలంలోని మేడిదిన్నె గ్రామం. ఇతని తల్లి అశ్వర్థమ్మకు క్యాన్సర్‌వ్యాధి సోకింది. తండ్రి సుబ్బరాయుడు కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు. వ్యాధి తీవ్రత ఎక్కువై కొంత కాలానికే తల్లి అశ్వర్థమ్మ మరణించింది. తండ్రి కుమారుడిని బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివించాడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.  వెంకట సురేష్‌ కష్టపడి ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం  తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఓగా పనిచేస్తున్నాడు.  తండ్రికి మంచి పేరు తెచ్చాడు.

 ఫీజు రీయింబర్స్‌మెంట్: నా పేరు మంత్రాల ప్రదీప్‌కుమార్. మాది ముద్దనూరు మండలం, యామవరం గ్రామం. నేను కడపలోని ఆర్ట్స్‌ కాలేజీలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. సమీపంలోని ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాను. నాకు నెలకు రూ.1400 స్కాలర్‌షిప్‌ వస్తుంది. అంటే 10 నెలలకు రూ.14 వేలు హాస్టల్‌లో ఉంటున్నందు వల్ల ఈ డబ్బు హెచ్‌బ్ల్యూఓ ఖాతాలోకి వెళుతుంది.  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఏడాదికి ఒక్కోరికీ రూ.20 వేలు ఇస్తామన్నారు.    ఏడాదికి రూ.14 వేలు పోను, మిగిలిన రూ.6 వేలు అమ్మ ఖాతాలోకి వెళుతుంది. విద్యార్థులందరం సీఎంకు అండగా ఉంటాం. ఈ పథకం పేద విద్యార్థులకు వరం     లాంటిది.

వాహనమిత్ర: నా పేరు రవికుమార్, మాది కడప నగరం, నేను సొంతంగా ఆటో కొనుగోలు చేసుకుని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ వాహన మిత్ర పథకంలో రూ.10వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లే పథకాన్ని అమలు చేశారు. ఖాతాలో నగదు జమ చేశారు. ఏటా రూ.10వేలు ఇవ్వడం మాలాంటి పేదోళ్లకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతాయి.

మాట తప్పని నాయకుడు  
నాపేరు వర్ధిబోయిన రమణయ్య. నేను చెన్నూరు బెస్తకాలనీలో ఉంటున్నాను. వృత్తి రీత్యా చేపల వ్యాపారం చేస్తాను. గతంలో ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పక్షనేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అనేకమంది బాధితులు ఆయన్ను కలిసి కష్టాలు తెలియజేశారు. అప్పుడు బెస్తల వలలకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే మేము నమ్మలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన అయిదు నెలలకే చెప్పిన మాట ప్రకారం మాకు సహాయం చేసి దేవుడయ్యారు. అందరూ వాగ్దానాలు చేస్తారు. వాటిని అమలు చేసేవారే నిజమైన నాయకులుగా మిగిలిపోతారు. మాటతప్పని మడమతిప్పని మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 
  
ఆదరణ మరువలేనిది 
నాపేరు హేమలత. మాది పులివెందుల మండలం. మిట్టమల్లేశ్వరస్వామి ఆలయ పాలక మండలి సభ్యురాలుగా ఉన్నాను. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలపట్ల చూపుతున్న ఆదరణ మరువలేనిది. పులివెందుల పట్టణంలో బీసీ వర్గానికి చెందిన నేను మొదటినుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో ఉన్నాను. 2014 మున్సిపల్‌ ఎన్నికలలో నాకు కౌన్సిలర్‌గా అవకాశం కల్పించారు. 2019 వరకు నేను ప్రజలకు సేవలు అందించాను. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినెటేడ్‌ పదవులలో 50శాతం మహిళలకు కేటాయించారు. అందులో భాగంగా బీసీ మహిళగా నాకు పులివెందుల పట్టణంలోని ఎంతో ప్రాముఖ్యత ఉన్న దేవాలయం మిట్టమల్లేశ్వరస్వామి ఆలయ పాలక మండలి సభ్యురాలుగా నియమించారు. ఈ ప్రభుత్వం మహిళల పట్ల చూపుతున్న ఆదరణ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు.  

నాపేరు బోలా నారాయణ. మత్స్య కారుడిని. మత్స్య కారుల సంఘం నాయకుడిగా ఉన్నాను. మాది బద్వేలు పట్ణణం బెస్తవీధి. గత ప్రభుత్వం మత్స్యకారులకోసం ఎలాంటి సహాయనిధి ఏర్పాటు చేయలేదు. ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో  అధికారంలోకి రాగానే మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పారు. వేట నిషేధ సమయంలో  ఏడాదికి రూ.10వేలు, ప్రమాదవశాత్తూ  మరణిస్తే పది లక్షల రూపాయలు ఎక్స్‌ గ్రేషియా ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే హామీని అమలుచేశారు.

వాళ్ల నాయన లాగే పేదోళ్లకు మంచి చేస్తున్నాడు 
నాపేరు లలితమ్మ. మాది రాజంపేట. నాకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పింఛన్‌ వచ్చింది. అంతకు ముందు సానా మార్లు కాయితాలు పెట్టుకున్నా ఇవ్వలేదు. రాజశేఖరరెడ్డి సీఎం కుర్చీ ఎక్కినాక మాబోటి ముసలోళ్లందరికీ పింఛన్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన బిడ్డ జగన్‌ కూడా ఎలచ్చన్‌లో చెప్పినవన్ని చేస్తున్నాడు. సీఎం కాగానే రూ.2250 పింఛన్‌ ఇస్తున్నాడు. మళ్లే వచ్చే సంవత్సరం 250 రూపాయలు పింఛన్‌ పెంచుతాడని అందరూ చెబుతున్నారు. జగన్‌ బాబు తప్పకుండా పేదళ్లకు మేలు చేస్తాడు. మాబోటి పేదోళ్లకు ఇంతకంటే ఏమి కావాలి. 
 
‘కాపు’రం బాగుండాలని..
ఈమె పేరు పూలశెట్టి రాజేశ్వరమ్మ. ఉంగరాలనగర్, రైల్వేకోడూరు పట్టణం. గత ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎన్నడూ కాపులకు ఎటువంటి పరిహారాలు ఇవ్వలేదని చెబుతోంది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక కాపునేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు ఇవ్వడంతో తమ కుటుంబానికి ఒక భరోసా లభించిందని ఆనందం వ్యక్తం చేస్తోంది. కాపు నేస్తం పథకానికి మీసేవలో సర్టిఫికెట్‌ తీసుకుని వలంటీర్లకుకు ఇచ్చానని, ఈ పథకం ద్వారా జగనన్న పెద్ద భరోసా కల్పించారని హర్షం వ్యక్తం చేస్తోంది.  
 
మాబాధలు సీఎం జగనన్నకే అర్థమయ్యాయి 
నా పేరు కొండమ్మ. మాది రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేట. పదేళ్లుగా మెప్మాకార్యాలయంలో ఆర్‌పీ పనిచేస్తున్నాను. అప్పట్లో పట్టణ సమాఖ్య నుంచి రూ.1000లు, కొద్దిరోజులకు రూ. 1500 జీతం తీసుకుంటూ పనిచేశాం. చంద్రబాబు పాలనలో సమాఖ్య నుంచి రూ.2వేలు, ప్రభుత్వం నుంచి రూ.3 వేలు చొప్పున మొత్తం రూ. 5 వేలు అందుతుండేది. ఇళ్లు గడవడం, పిల్లలను చదివించుకోవడం కష్టంగా ఉండేది.  వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో మా బాధలను విన్నారు. మమ్మల్ని అర్థం చేసుకున్నారు. సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే మాజీతాలను రూ.10 వేలకు పెంచి ఆర్థికంగా ఆదుకున్నారు. జగనన్న మేలును ఈ జన్మలో మరిచిపోలేం. మరింత ఉత్సాహంగా పనిచేసి జగనన్న ప్రభుత్వానికి మంచిపేరు తెస్తాం.

మద్యపాన నిషేధం: నా పేరు మున్ని. ప్రొద్దుటూరు పట్టణం. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఎన్టీఆర్‌ ప్రభుత్వం హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉండేది. ఆ సమయంలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మద్య నిషేధానికి తిలోధకాలు ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయడం సంతోషించతగ్గ విషయం. మద్యం షాపులను, బార్లను తగ్గించడ, అమ్మకాల సమయాన్ని కుదించడం శుభపరిణామం. సంపూర్ణ మద్య నిషేధం అమలుకు కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళాలోకం తరఫున ధన్యవాదాలు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top