ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో ‘అమ్మోనియా’ లీక్

One person died of ammonia gas leak in SPY Agro Industries Limited Factory - Sakshi

అక్కడికక్కడే మేనేజర్‌ మృతి.. ప్రాణాలతో బయటపడ్డ నలుగురు కార్మికులు 

గంటల వ్యవధిలోనే లీకేజీని అదుపులోకి తెచ్చిన అధికార యంత్రాంగం

నంద్యాల/కర్నూలు (సెంట్రల్‌): కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అమ్మోనియా గ్యాస్‌ లీకై ఒకరు మృతిచెందారు. మరో నలుగురు ఘటనా స్థలం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఫ్యాక్టరీ జనసేన పార్టీ నేత, మాజీ ఎంపీ దివంగత ఎస్పీవై రెడ్డి కుటుంబానికి చెందినది. 
► శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో డ్రై ఐస్‌ తయారు చేసే యూనిట్‌లోకి నిర్వహణ పనుల నిమిత్తం మేనేజర్‌ శ్రీనివాసరావు(50), మరో నలుగురు సిబ్బంది వెళ్లారు.  
► అమ్మోనియా గ్యాస్‌ సరఫరా అయ్యే పైపునకు వెల్డింగ్‌ చేస్తుండగా అది పగిలిపోయి గ్యాస్‌ ఒక్కసారిగా లీకైంది. జనరల్‌ మేనేజర్‌ అక్కడికక్కడే కుప్పకూలి మరణించగా, మిగిలిన నలుగురు తిప్పారెడ్డి, హరినారాయణ, రవి, తిరుమల బయటకు పరుగుదీసి ప్రాణాలు దక్కించుకున్నారు. మృతుడిది విజయవాడ కాగా, దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. విషయం తెలియడంతో అదే ప్రాంగణంలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులుదీశారు.  
► కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 
► మూడు ఫైరింజన్లు, రెండు అంబులెన్స్‌లను రప్పించారు. ఫైరింజన్లతో గ్యాస్‌ లీకయిన ప్రదేశంలో నీటిని చల్లించి.. గ్యాస్‌ మరింతగా వ్యాపించకుండా కట్టడి చేశారు.  
► అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిసర ప్రాంతాల్లోని కార్మికులు, ప్రజలను అక్కడి నుంచి పంపించివేశారు.  
► గ్యాస్‌ లీకేజీ ఘటనపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఇందుకోసం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సోమశేఖరరెడ్డి నేతృత్వంలో నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నారాయణమ్మ, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ శేషగిరిరావు, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మునిప్రసాద్, నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డితో కమిటీని నియమించారు. ప్రజలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని కలెక్టర్‌ చెప్పారు.  

కేసు నమోదు 
► గ్యాస్‌ లీకైన ఘటనకు సంబంధించి యాజమాన్యంపై ఫ్యాక్టరీల చట్టంలోని సెక్షన్‌ 92, 284, 285, 304ఏ కింద కేసులు నమోదు చేసినట్టు నంద్యాల రూరల్‌ సీఐ దివాకర్‌రెడ్డి చెప్పారు.  

 నిర్వహణ లోపాలే కారణం.. 
► ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అమ్మోనియో గ్యాస్‌ లీకేజీకి యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. చాలాకాలంగా ఉన్న నిర్వహణ లోపాలే ప్రస్తుత స్థితికి కారణమని అధికార వర్గాలంటున్నాయి.  
► అమ్మోనియా గ్యాస్‌ వెళ్లే పైపులు పదేళ్ల కిందటివి. వీటిని మధ్యలో మార్చాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అవి దెబ్బతిన్నాయి. 
► ఇలాంటి ప్రదేశాల్లో కూలింగ్‌ సిస్టం ఉపయోగించాలి. ఇక్కడ ఆ ఊసే లేదు.  
► అమ్మోనియా గ్యాస్‌ డిటెక్టర్లుంటే.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అవి మోగుతాయి. సిబ్బంది అప్రమత్తం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కనీసం అగ్నిమాపక పరికరాలను కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఫ్యాక్టరీ నుంచి రసాయనాలు లీక్‌ అవుతున్నాయని, పట్టణం వరకూ దుర్వాసన వస్తోందంటూ ప్రజలు గతంలో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తెచ్చారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.  
► ఈ నేపథ్యంలోనే ఈ నెల 11వ తేదీన జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలి జేసీఈఈ(జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌) వెంకటేశ్వరరావు, ఈఈ మునిప్రసాద్, ఆర్వో గణేష్‌ల బృందం పలు విభాగాలను పరిశీలించింది. 
► నెలరోజుల్లోగా నిర్వహణ లోపాలు సరిచేసుకోవాలంటూ యాజమాన్యానికి నోటీసులు కూడా ఇచ్చింది. లేకుంటే ఫ్యాక్టరీని సీజ్‌ చేసేందుకు కూడా వెనుకాడేదిలేదంటూ జేసీఈఈ హెచ్చరించారు. 
► ఆ హెచ్చరికలను ఫ్యాక్టరీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో శుక్రవారం నుంచే గ్యాస్‌ కొద్ది కొద్దిగా లీకైనట్టు తమ దృష్టికి వచ్చిందని జేసీఈఈ తెలిపారు.  
► నిర్వహణ సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు కూడా యాజమాన్యం సమకూర్చకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top