స్మగ్లర్లపై ఉక్కుపాదం : సీఎం | kiran kumar reddy calls take action on smugglers | Sakshi
Sakshi News home page

స్మగ్లర్లపై ఉక్కుపాదం : సీఎం

Dec 19 2013 1:29 AM | Updated on Jul 29 2019 5:31 PM

స్మగ్లర్లపై ఉక్కుపాదం :     సీఎం - Sakshi

స్మగ్లర్లపై ఉక్కుపాదం : సీఎం

ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేసేందుకు, అటవీ నేరాలను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

 సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచివేసేందుకు, అటవీ నేరాలను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. చిత్తూరుజిల్లా శేషాచల అడవుల్లో ఇద్దరు పోలీసు అధికారులను స్మగ్లర్లు హత్య చేసిన నేపథ్యంలో ఎర్రచందనం పరిరక్షణకు, స్మగ్లర్ల ఏరివేతకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘సంఘటనలు జరిగినప్పుడు స్పందించి తాత్కాలిక చర్యలు తీసుకోవడం కాకుండా అటవీ నేరాల నియంత్రణకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి. గురువారమే కూర్చొని ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం, చేయాల్సిన ఏర్పాట్లపై దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించండి’’ అని అటవీ, పోలీసు శాఖల ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. శేషాచలం ఘటనపై సంయుక్త దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని వారికి సూచించారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు అటవీ సిబ్బందికి 250 సింగల్ బ్యారెల్ గన్స్, 125 రివాల్వర్లు కొనుగోలుకు సంబంధించిన ఫైలుకు ఆమోదం తెలిపారు. తక్షణమే ఆయుధాలు కొనుగోలు చేయాలని, ఇవి వచ్చేలోగా అటవీ సిబ్బందికి పోలీసు శాఖ ఆయుధాలు సమకూర్చాలని నిర్ణయించారు. ఎర్రచందనం చెట్లున్న నాలుగు జిల్లాల్లోని ఏడు అటవీ డివిజన్లలో డివిజనల్ అటవీ అధికారి నియంత్రణలో 20 సాయుధ దళాలను సమకూర్చాలని ఆదేశించారు.
 
 పీడీ యాక్డు, నాన్‌బెయిలబుల్ కేసులు: స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు, నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టేలా అటవీ చట్టానికి సవరణలు చేసి తక్షణమే గెజిట్‌లో ప్రచురించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది వారసులకు కల్పిస్తున్న అన్ని ప్రయోజనాలను అటవీ సిబ్బందికి కూడా కల్పించాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement