అందరికి కాదు... కొందరికే...!

Defaults Of Yuva Nestam - Sakshi

ఎన్నికల ముందు నిరుద్యోగులకు టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పక్షపాతం

నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులకు కుచ్చుటోపి

సాక్షి, యర్రగొండపాలెం (ప్రకాశం): టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు నిరుద్యోగులకు బాబు వస్తే జాబు గ్యారెంటీ అని, జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీలతో నిరుద్యోగ యువకులు ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తులు చేసుకునేందుకు, ఫీజులు కట్టేందు తల్లిదండ్రులపై ఆధారపడనవసరం లేదని భావించారు. అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి లేకపోవడంతో ఉద్యోగాలు లేక, ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన  అనంతరం ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు చేసి ఉంటే, ఒక్కొక్క  నిరుద్యోగికి నెలకు రూ. 2 వేలు చొప్పున ఈ సంవత్సరాల కాలంలో రూ.120,000 భృతి అంది ఉండేది.

ఈ పథకం అమలులో చిత్తశుద్ధి లోపించడంతో ఒక్కొక్క నిరుద్యోగి దాదాపు లక్ష రూపాయలకు  పైగా నష్టపోయామని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన పలు జనాకర్షణ హామీలతో అధికారంలో కొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేశారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్నయన్న సమయంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు చేసి, ప్రజాసాధికారిక సర్వే ఆధారంగా ఒక్కొక్క నిరుద్యోగికి మొదట రూ.1000 చొప్పున మంజూరు చేశారు. తర్వాత నిరుద్యోగ భృతిని రూ.2000కు పెంచారు. ఈ పథకం అమలులోనూ సీబీఎన్‌ ఆర్మీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని నియోజవకర్గంలో పలువురు నిరుద్యోగులు అంటున్నారు.

యువనేస్తం కొందరికే వచ్చింది 
టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు అమలు చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగభృతి మండలంలో కొందరికి మాత్రమే అందుతుంది. ఈ పథకం కింద మీసేవలో దరఖాస్తు చేసినప్పటికీ, మంజూరు కాలేదు. యువనేస్తం పథకం అమలులో చిత్తశుద్ధి లోపించింది.
– ఆదిమూలపు కొండయ్య (బీఏ), నాయుడుపాలెం గ్రామం, పుల్లలచెరువు మండలం

ఒక నెల మాత్రమే వచ్చింది 
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి రూ.1000, ఒక నెల మాత్రమే వచ్చింది. ఆ తరువాత నెల నుంచి రావడం లేదు. 1100 నంబరుకు ఫోన్‌ చేసినప్పటికీ, సరైన స్పందన లేదు. ఎందుకు రద్దు చేశారో తెలియడం లేదు. ఎన్నికల ముందు ఈ పథకం అమలు చేయడం నిరుద్యోగులను మరొకసారి మోసగించడమే.
– జిల్లెల చెన్నారెడ్డి (ఎంఫార్మసీ), తోకపల్లె గ్రామం, పెద్దారవీడు మండలం

నిరుద్యోగ భృతి మంజూరు కాలేదు
ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఆన్‌లైన్‌లో అప్లై చేసినప్పటికీ, ప్రభుత్వం నిరుద్యోగ భృతి మంజూరు చేయలేదు. అర్హులైన నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పథకం కొందరికే వర్తింపజేశారు. బీఎస్సీ విద్యను పూర్తి చేసి, నిరుద్యోగ భృతి పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు ప్రభుత్వం నిరుద్యోగభృతి మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
– అందుగుల రత్నరాజు (బీఎస్సీ), యడవల్లి గ్రామం, దోర్నాల మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top