అందుకే విద్యుత్‌ ఒప్పందాల పునఃసమీక్ష : అజేయ కల్లం

AP Government Loss For Power Purchase Agreement Ajay Kallam Says - Sakshi

అధిక ధరల ఒప్పందం వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది

విద్యుత్‌ కొనుగోళ్లలో పారదర్శకత తెస్తామన్న అజేయకల్లం 

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. గతంలో పోలిస్తే విద్యుత్‌ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి విద్యుత్‌ కొనాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..అందులో భాగంగా గతంలో ఎవరూ తీసుకోని విధంగా గతంలో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. పీపీఏల రద్దువల్ల పెట్టుబడులు వెనక్కివెళ్లిపోతాయని కొంతమంది దుష్ఫ్రచారం చేస్తోన్నారని..కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కరెంటు సరఫరా చేసేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.

‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఉండాలి. ప్రస్తుతం మనం ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొంటున్నాం. గత ప్రభుత్వం పీపీఏలను రూ.6లకు ఒప్పందం చేసుకుంది. సౌర విద్యుత్‌ఒప్పందం రూ. 4.84కు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విండ్‌ సోలార్‌, విద్యుత్‌ ధరలు తగ్గిపోయాయి. 2010లో రూ.18 ఉన్న సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.45 తగ్గింది. పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.20 నుంచి 43 పైసలకు తగ్గిపోయింది. ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనాల్సిన అవసరం రాష్ట్రానికి లేదు. అధిక ధరల ఒప్పందం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. పీపీఏలు లేకుండానే యూనిట్‌ విద్యుత్‌ను రూ. 2.72లకు అందించేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి’ అని అజేయ కల్లం అన్నారు. 

ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. డిస్కంలు రుణపరిమితి దాటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారన్నారు. ప్రస్తుతం డిస్కంలు రూ. 20వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రూ.26.6శాతానికి చేరుకుందని తెలిపారు. కొత్తగా వస్తున్న పరిశ్రమలపై విద్యుత్‌ భారం వేయలేమని తేల్చి చెప్పారు.

ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో మార్పులు
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో మార్పులు జరిగాయి. అడ్వకేట్‌ జనరల్‌ స్థానంలో న్యాయశాఖ కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి సంప్రదింపు కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌ శ్రీకాంత్‌లు ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top