అక్రమార్జనకు ఆధార్‌

Aadhaar Fraud In Meeseva Centers In Kadapa - Sakshi

పెన్షను ఆశ చూపి వయసు పెంచుతామని మీ సేవకేంద్ర నిర్వాహకుల ఎర 

భారీగా వసూళ్లకు తెరలేపిన వైనం

ఆధార్‌ అక్రమాలపై దృష్టి సారించిన అధికారులు

సాక్షి , కడప : రూ.5 వేలు ఇస్తే ఆధార్‌ కార్డులో వయస్సు మార్చేస్తామంటూ కొన్ని మీసేవ కేంద్రాలు అక్రమ వ్యాపారానికి తెరలేపాయి. వృద్ధా్దప్య పెన్షన్ల ఆశ చూపి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొందరు అత్యాశకు పోయి వీరి వలలో చిక్కుకుని అడిగింది ముట్టజెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఎక్కువ మీసేవ కేంద్రాలు ఆధార్‌లో వయస్సు మార్పిడి వ్యవహారానికి తెరలేపాయి. తక్కువ వయసును ఎక్కువగా చూపించి జన్మభూమి కమిటీలు పెన్షన్లు  మంజూరు చేయించాయి. ప్రతిఫలంగా భారీ మొత్తం లబ్ధి పొందాయి. ఇందువల్ల అర్హత లేని వారికి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరయ్యాయి. అక్రమ వ్యాపారానికి అలవాటు పడ్డ కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు తాజాగా ఇదే వైఖరిని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధార్‌లో వయసు మార్పిడి చేస్తూ అక్రమార్జనకు దిగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. బి.మఠం, గోపవరం, బద్వేలు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, కడపతోపాటు దాదాపు ఎక్కువ మండలాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఎగబడుతున్న వైనం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెన్షన్‌ మొత్తాన్ని పెంచింది. పెన్షన్‌కు అర్హత వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిం చింది. పెద్ద మొత్తంలో నెలనెల కచ్చితంగా పెన్షన్‌ వస్తుండడంతో కొందరు మీసేవ నిర్వాహకులు గ్రామాల్లో జనా నికి పెన్షన్‌ వల విసురుతున్నారు. రెండు నెలల పెన్షన్‌ తమకు ఇస్తే  జీవితకాలం పెన్షన్‌  పొందే అవకాశ మంటూ  ఆఫర్లు చూపుతున్నారు.  అక్రమమని తెలిసినా కొందరు ఆధార్‌లో వయస్సు మార్పుకు ఎగబడుతున్నారు. ఆధార్‌కార్డును అధికారులు ప్రామాణికంగా తీసుకోవడంతో  కొన్ని మీసేవ కేంద్రాలవారు దీనిని అవకాశంగా భావిస్తున్నారు. దీంతో వయసు మార్పిడీ వ్యవహారం సాగిస్తున్నారు.

కొందరు రూ.4 వేల నుంచి రూ. 5 వేలు చెల్లించి ఆధార్‌లో వయస్సు మార్పించుకొంటున్నారు.  అర్బన్‌ పరిధిలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటిలలో ప్రభుత్వ భవనాలలో  వేతన ప్రాతిపదికన 11 మీ సేవలు నడుస్తున్నాయి. ఇందులో పనిచేసే ఉద్యోగులకు కార్వే కంపెనీ జీతాలు చెల్లిస్తోంది. ఇవి కాకుండా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో సెలెక్షన్స్‌ నిర్వహించి పలువురు నిరుద్యోగులకు ఇచ్చినవి 44 ఉన్నాయి.ఇవి  అర్బన్‌ కేంద్రాల్లో కమీషన్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఏపీ ఆన్‌లైన్‌ ఆధ్వర్యంలో 318 మీ సేవా కేంద్రాలున్నాయి. ఏపీ ఆన్‌లైన్‌ పరిధిలో కమీషన్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న మీ సేవలు మరో 700 వరకు ఉన్నాయి.

మీసేవల్లో అక్రమాలు:
కమీషన్‌ ఆధారంగా పనిచేస్తున్న వెయ్యికి పైగా మీ సేవల్లో ఆధార్‌కార్డు వయస్సు మార్పిడీ వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన విభాగాల్లోని కొన్ని చోట్ల కూడా ఈ అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు 3,01,691 ఉన్నాయి. 1, 35,788 మంది వృద్దాప్య పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్లు పొందుతున్నవారిలో 2,247 మంది ఒంటరి మహిళలు , అభయ హస్తం కింద 4,054 మంది , సీకేడీయూలో 343మంది, 1,645 మంది డప్పు కళాకారులు ,37,164 మంది దివ్యాంగులు , 492 మంది మత్స్యకారులు, 277 మంది కల్లుగీత కార్మికులు, 844 చర్మకళాకారులు, 12,511 మంది చేనేతలు..1,06,180 మంది వితంతువులు ఉన్నారు.  కొత్తగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా, మరికొంతమంది దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఆగస్టు 15 నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమలులోకి రానుండగా, అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ పనిచేయనుంది. ఈ వ్యవస్థలు ఏర్పడగానే అర్హులకు పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ పరిస్థితుల్లో దీనిని అవకాశంగా తీసుకుని మీసేవలు  డబ్బులు దండు కొనేందుకు జనాలకు వల వేస్తు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి. జిల్లా అధికారులు స్పందించి  మీసేవ కేంద్రాలలో ఈ వ్యవహారంపై ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇప్పటికే మీ సేవ బాధ్యతలు చూస్తున్న పలువురితో సమావేశమైనట్లు సమాచారం.మీ సేవలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top