● విద్యుదాఘాతానికి మృతి చెందుతున్న మూగజీవాలు
● అవగాహన లేక పరిహారం
పొందలేకపోతున్న బాధితులు
దుద్యాల్: విద్యుదాఘాతానికి మూగజీవాలు బలవుతున్న సంఘటనలు అధికమవుతున్నాయి. దీనిపై అవగాహన లేక చాలా మంది నష్ట పరిహారం పొందడం లేదు. ప్రస్తుతం వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి కింద పడుతుంటాయి. పశువులు, పశువుల కాపరులు, రైతులు కింద పడిన విద్యుత్ తీగలను గమనించకుండా వాటికి తగిలి మృత్యువాత పడుతున్న సంఘటనలు ఉంటాయి. ఈ ప్రమాదాల్లో నష్టపోయిన కుటుంబాలకు విద్యుత్‌శాఖ పరిహారం అందిస్తుంది. కానీ ప్రభుత్వం అందించే పరిహారంపై అధిక శాతం మందికి అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారు. ఒక వైపు పశువులు, మరో వైపు మనుషులు విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడుతున్నారు. పరిహారం పొందే విధానం గురించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
పరిహారం అందుకునే విధానం
విద్యుత్ ప్రమాదం జరిగిన వెంటనే పరిహారం కోసం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కేసు నమోదైన తర్వాత పశువైద్యుల సహాయంతో శవ పంచనామా చేయించాలి. కేసుకు సంబంధించిన పత్రాలతో విద్యుత్ శాఖ సహాయక ఇంజనీర్ దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. మరణ ధ్రువపత్రం, ఎఫ్‌ఐఆర్, పంచనామా నివేదిక, ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం తదితర కాపీలను జతపరిచి విద్యుత్ ఏఈకి అందజేయాలి. ఏఈ నుంచి పత్రాలు ఏడీఈకి చేరుతాయి. ఆ పత్రాలు ఉన్నతాధికారులకు అందిన తర్వాత నష్ట పరిహారం బాధితుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.
మానవులకు ప్రమాదం జరిగితే
విద్యుత్ ప్రమాదంతో అంగ వైకల్యం కలిగితే ప్రమాద విషయాన్ని వెంటనే విద్యుత్‌శాఖ అధికారులకు తెలియజేయాలి. వైద్యం నిమిత్తమైన ఖర్చుకు సంబంధించిన బిల్లులు, ఇతర ఖర్చుల వివరాలకు సంబంధించి ధ్రువ పత్రాలు దరఖాస్తుకు జతపరిచి ఏఈకి అందించాలి. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి నష్ట పరిహారం మంజూరు చేస్తారు.
మూగజీవాలకు అయితే..
పశువులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందితే ముందుగా సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించాలి. పశువైద్యాధికారి నుంచి పశువు ఖరీదు తెలిపే పత్రం, మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. మృతి చెందిన పశువు నిమిత్తం పరిహారం బాధితుడికి అందిస్తారు. పశు వైద్యులు సూచించిన మేరకు నష్ట పరిహారం అందుతుంది.
అర్హులకే ఇస్తాం
విద్యుత్ ప్రమాదాలకు సంబంధించిన బాధిత కుటుంబాలు అర్హులైతే పరిహారం తప్పకుండా అందుతుంది. ప్రమాదం జరిగిన స్థాయిని బట్టి పరిహారం ఉంటుంది. నిబంధనల ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. మూగ జీవాల విషయంలో పశువైద్యాధికారి ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకుంటున్నాం.
– ఆనంద్, విద్యుత్ ఏఈ, దుద్యాల్
పరీక్షలు చేస్తాం
మూగ జీవాలకు విద్యుత్ ప్రమాదం సంభవించిన వెంటనే పశువైద్యులకు తెలియజేయాలి. ప్రమాదం జరిగిన పశువుకు నిర్ధారణ పరీక్షలు చేస్తాం. నిజ నిర్ధారణ తర్వాత పశువుకు సంబంధించి మరణ ధ్రువ పత్రం, పరీక్షకు సంబంధించి పత్రాలు పశువు యాజమానికి అందిస్తాం.
– పరమేశ్వర్,
పశువైద్యాధికారి, కొడంగల్
ఇటీవల సంఘటనలు
దుద్యాల మండలం పోలేపల్లి తండాకు చెందిన రాథోడ్ చందు నాయక్‌కు సంబంధించి రూ.70 వేల విలువ చేసే పాలిచ్చే గేదె తండాలోనే ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది.
మండలంలోని పల్లెగడ్డకు చెందిన ముకుంద రెడ్డికి సంబంధించి రూ.60 వేల విలువ చేసే ఎద్దు విద్యుత్ షాక్ గురై మృత్యువాత పడింది.
కొడంగల్ మండలం పల్గురాళ్ల తండా మునేగారి సాయిలుకు చెందిన రూ.50 వేల విలువ చేసే ఎద్దు విద్యుదాఘాతానికి గురై మరణించింది.
రోటిబండ తండాకు చెందిన పాండు నాయక్(61) పశువులకు మేత కోసి వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. అలాగే సేవ్యానాయక్ చెందిన రూ.90 వేల గేదె విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాత పడింది.


