నేరుగా అమ్మడమే బాగుండేది
చాలా మార్పులు వచ్చాయి
కొందుర్గు: ఎరువుల కొనుగోలుకు రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దని.. విక్రయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఎంపికచేసింది. ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్’ యాప్ ద్వారా డీలర్లు ఎరువులు విక్రయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వివరాల నమోదులో రైతులకు తిప్పలు తప్పడం లేదు.
ఇవీ ఇబ్బందులు
● రైతులకు యాప్‌పై అవగాహన లేకపోవడం.
● రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం.
● యాప్‌లో వివరాల నమోదు సమయంలో ఎర్రర్స్ తలెత్తడం.
● యాప్‌లో పొందుపరిచిన పంటల పేర్లు వాడుక భాషలో లేకపోవడంతో రైతులకు పంటల పేర్ల నమోదులో ఇబ్బందులు.
● కొన్ని పంటల పేర్లు డీలర్లు, అధికారులకు సైతం అర్థం కాకపోవడం విశేషం.
● రైతులు నగదు చెల్లించి ఎరువులు కొనలేని పరిస్థితి. ఈ సమయంలో రెగ్యులర్‌గా కొనుగోలు చేసే డీలర్ వద్ద తమకు అవసరమైన ఎరువుల స్టాకు లేకపోవడం.
● రైతుల భూమి వివరాలు యాప్‌లో పూర్తిస్థాయిలో కనిపించకపోవడం.
● డీలర్ వద్ద ఉన్న ఎరువుల స్టాకు యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డెట్ కాకపోవడం. స్టాకు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపించడం.
● రైతుల భూముల వివరాలు హెక్టార్లలో చూపడంతో అయోమయం.
● హాకా రైతు కేంద్రాల అడ్రస్ పూర్తిస్థాయిలో కనిపించకపోవడం.
● ఒకే రైతు రెండు రకాల కాంప్లెక్స్ ఎరువులు తీసుకోవడానికి వీలు లేకపోవడం.
● సింగిల్ సూపర్ పాస్పేట్ యాప్‌లో కనిపించకపోవడం.
ఇలా చేస్తే మేలు
● రైతులకు అనుకూలంగా ఉండేలా యాప్‌ను సులభతరం చేయాలి.
● పంటల నమోదును డైరెక్టుగా వాడుక భాషలో నమోదు చేసుకునేందుకు వీలు కల్పించాలి.
● గ్రామాలవారీగా సదస్సులు నిర్వహించి రైతులకు యాప్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి.
● పంటల అవసరం మేరకు ఏ రకం ఎరువులైనా బుక్‌చేసుకునే వీలు కల్పించాలి.
● ప్రభుత్వమే ప్రతి గ్రామంలో వలంటీర్లను నియమించేలా చూడాలి.
● ఎండోమెంట్, వక్ఫ్ తదితర భూములు కౌలుకు తీసుకొని సాగుచేసుకునే రైతుల కోసం ప్రత్యేకంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలి.
ఈ ఏడాది యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు
పూర్తిస్థాయిలో అవగాహన కరువు
వినియోగంలో అడుగడుగునా ఎర్రర్స్
ఆందోళనలో అన్నదాతలు
ఎరువుల కోసం డీలర్లు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. విత్తనాలు నాటేందుకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో సర్కారు ఇలాంటి యాప్‌లు తీసుకురావడం బాగాలేదు. మాలాంటి రైతులకు చాలా ఇబ్బంది. రెండు మందు బస్తాల కోసం నాలుగైదు రోజులు తిరిగాను. నేరుగా అమ్మడమే బాగుండేది.
– కుర్వ నర్సింలు, కొందుర్గు
కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యాప్‌లో ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో రైతులు సునాయసంగా వినియోగించేలా మారుతుంది. సమస్యలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయిస్తున్నాం. యాప్‌తో రైతులు ఇబ్బంది పడకుండా వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి.
– రాజేందర్ రెడ్డి, ఏఓ, జిల్లేడ్ చౌదరిగూడ


