షాద్‌నగర్: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బేగరి మహేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు విక్రయిస్తున్నారని అన్నారు. విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ తల్లిదండ్రులపై అధనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. అక్రమ వసూళ్లు, పుస్తకాల దందాను అరికట్టాలన్నారు. విద్యను లాభార్జన సాధనంగా మార్చడం సమాజానికి హానికరమన్నారు. విద్యాశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
ఇబ్రహీంపట్నం: సమాజాభివృద్ధికి విద్య బలమైన పునాది అని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కురుమ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన కురుమ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం, నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. క్రమశిక్షణతో విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కురుమలంతా ఐకమత్యంతో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. కురుమలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర షిప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సరితతిరుపతయ్య, ది మిషన్ వ్యవస్థాపకుడు, ఎకై ్సజ్ సీఐ ఏడుకొండలు, ప్రముఖ ఇంపాక్ట్‌మోటివేషనల్ స్పీకర్ గాజుల శేఖర్, ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు శ్రీశైలం, జంగయ్య, బీరప్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ సూపర్
మంచాల: ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ చాలా బాగుందని ఆర్‌టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి అన్నారు. ఆదివారం స్కూల్‌ను సందర్శించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు, ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు.. విద్యా బోధన అమలు తీరు.. సదుపాయాలపై ఆరా తీశారు. కార్పొరేట్ కంటే చాలా బాగుందని కితాబిచ్చారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు శివారెడ్డి, చారకొండ వెంకటేశ్, పద్మజాష, డీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, ఎంఈఓ రాందాస్, హెడ్ ఆఫ్ ది స్కూల్ గిరిధర్‌గౌడ్, ఆరుట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాములు, నోడల్ ఆపీసర్ కిషన్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
17న సీఎం రేవంత్ రెడ్డి రాక!
ఈ నెల 17న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించినట్టు తెలిసింది.
చీరకు ఆర్డర్ పెడితే
ఖాతా ఖాళీ అయ్యింది
బంజారాహిల్స్: ఇన్‌స్ట్రాగామ్ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్ పెడితే యువతిని సైబర్ మోసగాళ్లు లింక్ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరిలో నివసించే ఏ.శిల్ప అనే మహిళ ఇన్‌స్ట్రాగామ్ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్ సిల్క్ శారీస్ పేరుతో రీఫండ్ లింక్ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్‌కార్డును బ్లాక్ చేసింది. అప్పటికే సైబర్ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


