మీర్‌పేట: టిప్పర్ రూపంలో దొసుకొచ్చిన మృత్యువు ఇద్దరు ఆటోడ్రైవర్లను బలిగొంది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రంగూడ ఆదిత్యనగర్‌కు చెందిన సునీల్ (35) ఆటో శనివారం రాత్రి 10.30 గంటలకు మందమల్లమ్మ చౌరస్తా వద్ద పాడైపోవడంతో స్నేహితుడైన గుర్రంగూడ అరవింద్‌నగర్ కాలనీకి చెందిన ప్రసాద్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. ప్రసాద్ తనకు పరిచయం ఉన్న మరో ఆటోడ్రైవర్ సంతోష్ (35)కు ఫోన్ చేసి రిపేరు కోసం సాయపడాలని పిలిపించాడు. ముగ్గురూ కలిసి సునీల్ ఆటోను తరలించేందుకు మరో ఆటోకు కట్టారు. ప్రసాద్ తన ఆటోను రోడ్డుకు అవతలి వైపు నిలపడంతో రోడ్డు దాటుతుండగా సునీల్, సంతోష్ ఆటోల పక్కన నిల్చున్నారు. అదే సమయంలో ఎల్‌బీనగర్ నుంచి ఓవైసీ వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్ (ఏపీ29వీ 3873) ఢీ కొట్టింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా, సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంతోష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి, గాయపడ్డ సునీల్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీల్ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. సంతోష్‌ది మాడ్గుల మండలం రాందుగ్యాల గ్రామం కాగా నగరానికి వచ్చి రెండ్రోజులు ఆటో నడిపి తిరిగి గ్రామానికి వెళ్తుంటాడు. సునీల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన జావాళ సురేష్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంతోష్ (ఫైల్)
సునీల్ (ఫైల్)
ఆగివున్న ఆటో డ్రైవర్లను ఢీకొట్టిన టిప్పర్
అక్కడికక్కడే ఒకరి దుర్మరణం
చికిత్స పొందుతూ మరొకరి మృతి


