ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులైన ఓటర్లను కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ ఆదేశాల మేరకు బొంగ్లూర్‌లోని ప్రమీదా కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్స్‌కు శిక్షణ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి, పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో కాంగ్రెస్ ఓట్లు పెద్ద ఎత్తున తొలగించబడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వహిస్తే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పారు. బీఎల్‌ఓలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో సాగుతూ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా కాపాడుకోవాలన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై జరిగే కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ట్రైనింగ్ కమిటీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బీఎల్‌ఏల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. నియోజకవర్గ బీఎల్‌ఓల శిక్షకుడు కృష్ణారెడ్డి ఓటరు జాబితా పరిశీలన, సవరణల ప్రక్రియ, ఇంటింటికీ నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, నాయకులు శేఖర్‌గౌడ్, రాచర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


