మేలైన దిగుబడి | - | Sakshi
Sakshi News home page

మేలైన దిగుబడి

Jun 15 2026 10:09 AM | Updated on Jun 15 2026 10:09 AM

పంట మార్పిడి..

కొడంగల్‌: ఖరీఫ్‌ సాగు(వానకాలం) సీజన్‌ మొదలైంది. కొద్ది రోజుల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకే రకమైన పంటలను ఏళ్ల తరబడి సాగు చేయడంతో దిగుబడి రాక అనేక సమస్యలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీడ పీడల బెడద అధికం కావడంతో పాటు భూమి సారం తగ్గుతుందని పంట మార్పిడితోనే ప్రయోజనం పొందవచ్చని ఆదర్శ రైతులు చెబుతున్నారు.

పత్తి, వరి, కంది అధికం

జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నప్పటికీ రైతులు వరి, పత్తి, కంది పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల బెడద పెరిగి రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో భూమి సారం కోల్పోయి పంట ఎదుగుదల క్షీణించి దిగుబడి రాక అన్నదాతలు నష్టపోతున్నారు. వానాకాలంలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా పంటలను సాగు చేస్తున్నారు. మరి కొందరు ఇతర పంటల సాగు విధానం తెలియక ఇబ్బంది పడుతున్నారు.

మార్పుతోనే మేలు

పంట మార్పిడి చేయాలంటే అంతకు ముందు వేసిన పంటకు భిన్నంగా ఇతర పంటను ఎంచుకోవాలి. ఒక ఏడాది కందులు వేస్తే మరుసటి ఏడాది జొన్నలు, పత్తి, ఇతర పంటలు వేయాలి. పంట మార్పిడి విధానంలో ప్రతి సంవత్సరం సాగు చేసే పంటలను మార్పు చేయాల్సి ఉంటుంది. పంట మార్పిడి చేసే రైతులు భూమి నుంచి పోషకాలను గ్రహించే పంటలకు బదులుగా భూమికి పోషకాలను అందించే పంటలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నలరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించే రైతులు మరుసటి ఏడాది సోయా చిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి ఆకులు పూర్తిగా రాలి తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ ఎరువును అందిస్తు్‌ంది.

చీడపీడల నివారణ కోసం

కొన్ని రకాల తెగుళ్లు కొన్ని పంటలను అధికంగా ఆశించి వ్యాప్తి చెందుతాయి. అలాంటి పంటలను వరుసగా వేసుకోకుండా మార్పిడి చేసుకోవాలి. పత్తి, వరి పంట వేయకుండా పప్పు ధాన్యపు పంటలు, నూనె గింజల పంటలు వేసుకోవాలి. జొన్న, సజ్జ, రాగి, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. దీంతో ఆయా పంటల్లో పురుగులను నివారించవచ్చు.

వేసుకోవాల్సిన పంటలు

కొడంగల్‌ నియోజకవర్గంలో అధిక మొత్తంలో కంది, పత్తి వేస్తారు. ఈ పంటలతో పోలిస్తే మినుము, పెసర, సోయచిక్కుడు పంటలకు కాయ తొలుచు పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది. గతంలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్‌లో మొక్క జొన్న పంట వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. శనగ పంట వరుసగా వేసుకుంటే కాయ తొలుచు పురుగుల తాకిడి పెరుగుతుంది. ఈ పురుగుల దాడి తక్కువగా ఉండే జొన్న, నువ్వులు, ఉలవ పంటలు వేసుకోవచ్చు.

ఒకే రకం పంటల సాగుతో నష్టం

ఖరీఫ్‌ సాగులో మెలకువలు ముఖ్యం

వ్యవసాయ పనులు మొదలుపెట్టిన కర్షకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement