రక్తదాతకు గవర్నర్‌ ప్రశంస | - | Sakshi
Sakshi News home page

రక్తదాతకు గవర్నర్‌ ప్రశంస

Jun 15 2026 10:09 AM | Updated on Jun 15 2026 10:09 AM

రక్తదాతకు గవర్నర్‌ ప్రశంస ఆవిర్భావ సభకు తరలిరండి బీఎల్‌ఏల నియామకంపై సమావేశం వైభవంగా ఆలయ వార్షికోత్సవం

అనంతగిరి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 118వ సారి రక్తదానం చేసిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సాయి చౌదరిని ఆదివారం గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా నగరంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. యువత దేశానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో సైతం రక్తదానం చేయడానికి ముందుకు వస్తానని సాయి చౌదరి పేర్కొన్నారు.

కొడంగల్‌ రూరల్‌: స్థానిక బంజారా భవన్‌లో జులై 1వ తేదీన నిర్వహించనున్న లంబాడ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్‌) 30వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యానాయక్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలో నాయకులతో కలిసి వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని, ఎస్టీలు సాగుచేస్తున్న లావుణి, సీలింగ్‌, పోడు భూములకు పూర్తి హక్కులతో అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బంజారా నాయకులు సామ్యానాయక్‌, రవినాయక్‌, లోక్యానాయక్‌, బాబ్యాయక్‌, కమ్లీబాయి, బిక్కిబాయి, సెంక్రిబాయి తదితరులు పాల్గొన్నారు.

కొడంగల్‌ రూరల్‌: గ్రామాల్లో సర్వే నిర్వహించే సమయంలో బీఎల్‌ఓలకు సంపూర్ణ సహకారం అందించేందుకు కృషి చేయాలని ిసీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ఇందనూర్‌ బషీర్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యదర్శి ఎండీ మహిమూద్‌ అధ్యక్షతన మండలాల కార్యదర్శుల ఆధ్వర్యంలో బీఎల్‌ఏల నియామక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పూర్తి స్థాయిలో అవగాహనతో సర్వేలో పొందుపరిచే విధంగా సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో నేతలు శ్యాంసుందర్‌, మల్లప్ప, ఎండీ రహీం, వెంకటప్ప, శ్రీనివాస్‌, మోహన్‌సింగ్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాండూరు టౌన్‌: పట్టణంలోని కొడంగల్‌ రోడ్డు మార్గంలోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తాండూరు పద్మశాలి సమాజ సభ్యులు, మార్కండేయ కాలనీవాసుల ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం అలంకరణ, అభిషేకం, మహామంగళ హారతి, గణపతి హోమం, మధ్యాహ్నం మహా నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీశివానంద గిరి స్వామి హాజరై ప్రవచనాలు వినిపించారు. అనంతరం పలువురు భక్తులు గీతాపారాయణం గావించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement