ప్రారంభానికి సిద్ధమైన కోట్‌పల్లి కేజీబీవీ హాస్టల్ భవనం
● అన్ని హంగులతో పూర్తయిన కేజీబీవీ హాస్టల్ భవనం
● హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు
త్వరలోనే ప్రారంభిస్తాం
కేజీబీవీ హాస్టల్ భవనం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ప్రహరీ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభిస్తాం. విద్యుత్ సౌకర్యం, తరగతి గదుల్లో ఫ్యాన్లు అమర్చడంతో పాటు ఇతర పనులన్నీ పూర్తి చేశారు. ఆరు నుంచి పదోతరగతి వరకు 250, ఇంటర్‌లో 160 మంది విద్యార్థినులు చదువుకునే అవకాశం ఉంది.
– చంద్రప్ప, ఎంఈఓ, కోట్‌పల్లి
బంట్వారం: మూడేళ్ల కిందట పనులు ప్రారంభించిన కోట్‌పల్లి కేజీబీవీ హాస్టల్ భవనం ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమైంది. రూ 3.5 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో కరీంపూర్ గేటు వద్ద పనులు మొదలు పెట్టి మూడు అంతస్తులు పూర్తి చేశారు. విద్యార్థినులకు అవసరమైన వసతులతో అందంగా తీర్చిద్దారు. పక్కా భవనం లేకపోవడంతో కొన్నేళ్లుగా కోట్‌పల్లి కేజీబీవీ తాత్కాలికంగా ప్రాథమిక పాఠశాల భవనంలోనే కొనసాగుతుంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కేజీబీవీలో ఇంగ్లిష్ మీడియం చదువుకునే అవకాశం ఉంది. తాత్కాలిక భవనంలో సరైన వసతులు లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులకు గురువుతున్నారు. ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన భవనం నిర్మించడంపై బాలికలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


