కొడంగల్: హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో రూ.25 కోట్లతో మున్నూరు కాపు భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య తెలిపారు. ఆదివారం కొడంగల్‌లో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మున్నూరు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేషన్ ద్వారా కుల బంధువులను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. మున్నూరు కాపు సంఘానికి ఐదు టవర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.25కోట్లతో మొదటి టవర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈనెల 17న రవీంద్రభారతిలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, బీసీ సంక్షేమ శాఖ సలహాదారులు హన్మంత్‌రావు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మిలను సన్మానిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం నియోజకవర్గం నుంచి కాచిగూడ మహాసభకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాకారం చంద్రశేఖర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొండారెడ్డిపల్లికి చెందిన మున్నూరు బిచ్చప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం కొడంగల్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మల్లయ్య, కోశాధికారి కానుకుర్తి నర్సిరెడ్డి, యువక మండలి రాష్ట్ర కార్యదర్శి శేఖర్‌రెడ్డి, నేతలు బిచ్చప్ప, శ్యాంసుందర్, వెంకటయ్య, వీరేశం, మాసన్న, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య


