అదును చూసి చదును! | - | Sakshi
Sakshi News home page

అదును చూసి చదును!

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

జేసీబీలతో యథేచ్ఛగా పనులు

ముఖ్య ప్రజాప్రతినిధి చెప్పారంటూ

బుకాయింపు

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు.. అధికార బలంతో కంటికి కనిపించిన భూములను కబళించేస్తున్నారు. అందులో భాగంగానే ఏర్పేడు మండలం రావిళ్లవారి కండ్రిగలో రూ.కోట్ల విలువైన నాలుగు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. అడ్డుకునేందుకు యత్నించిన రెవెన్యూ సిబ్బందిని ముఖ్య ప్రజాప్రతినిధి పేరు చెప్పి బెదిరింపులకు దిగారు. ఆక్రమిత ప్రాంతంలో జేసీబీలతో చదును పనులు మొదలుపెట్టేశారు.

ఏర్పేడు : మండలం పెనుమల్లం రెవెన్యూ పరిధి రావిళ్లవారి కండ్రిగ లో సర్వే నంబర్‌ 197/1లో 4.05 ఎకరాల ప్రభుత్వ అనాధీనం భూమి ఉంది. ఈ భూమి విలువ మార్కెట్లో రూ.4కోట్లకు పైగా పలుకుతుంది. అయితే ప్రభుత్వ భూమిపై స్థానిక టీడీపీ నేత ఒకరు కన్నేశారు. అధికార పార్టీ అండదండలు చూసుకుని ఎటువంటి అనుమతులు లేకుండా అదివారం ఉదయం జేసీబీలతో ఆ అనాధీనం భూమిని చదును చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణను గమనించిన గ్రామస్తులు వెంటనే ఫోన్‌ ద్వారా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్‌ఓ హరి అక్కడకు చేరుకుని భూమి చదును పనులను అడ్డుకున్నారు. అయితే వీఆర్‌ఓపై సదరు టీడీపీ నేత బెదిరింపులకు దిగారు. పనులు ఆపేది లేదని తెగేసి చెప్పటంతో వీఆర్‌ఓ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు.

గతంలో పేదల కోసం..

గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ భూమిపై కోర్టులో కేసు వేయగా, ప్రభుత్వ భూమిగా తేల్చింది. అప్పట్లో ఈ భూమిని గ్రామంలోని పేదలకు ఇంటిస్థలాలుగా మంజూరు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రావడంతో విలువైన ఈ భూమిపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. దీంతో ఆయన దర్జాగా జేసీబీ పెట్టి చదును చేసి ఆక్రమించేందుకు యత్నించారు. మే నెలలోను ఒక సారి ఇలాగే ముళ్ల చెట్లను తొలగించారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఇప్పుడుఉ మళ్లీ ముళ్ల చెట్లను తొలగించి ఈ భూమి తమదేనని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని బుకాయిస్తున్నారు. తనకు నియోజకవర్గం ముఖ్య ప్రజాప్రతినిధి సైతం భరోసా ఇచ్చారని, ఈ భూమి తమదేనని స్పష్టం చేస్తున్నారు. అధికార బలంతో విలువైన ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకునేందుకు యత్నించిన వ్యక్తిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే భూమి అన్యాక్రాంతం కాకుండా కంచె వేయించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వ భూమి కబ్జాకు టీడీపీ నేత యత్నం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement