శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ బ్రహ్మోత్సవాలను తలపించింది. ఆదివారం ఒక్క రోజే 55 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. రాహు – కేతు పూజలకు విశేష ఆదరణ లభించింది. వివిధ టికెట్ విభాగాల్లో కలిపి మొత్తం 7,597 మంది భక్తులు రాహు– కేతు పూజలు చేసుకున్నారు. దీని ద్వారా ఆలయానికి రూ.67 లక్షల దాకా ఆదాయం సమకూరింది. దర్శన విభాగంలో సీఘ్ర దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంతరాలయ దర్శనాలతో కలిపి 7,641 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించే వివిధ సేవల్లో 545 మంది భక్తులు పాల్గొన్నారు. ప్రసాదాల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. చిన్న లడ్డూలు, పులిహోర, వడలు, పెద్ద లడ్డూలు తదితర ప్రసాదాలను కలిపి 26,280 ప్రసాదాలు విక్రయించగా, 38 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. దేవస్థానం గణాంకాల ప్రకారం, ఆదివారం ఒక్కరోజే వివిధ సేవలు, దర్శనాలు, రాహు– కేతు పూజలు, ప్రసాదాల విక్రయాల ద్వారా కలిపి రూ.85,43,848 ఆదాయం లభించింది.


