సచివాలయం వద్ద టీఈజేఏసీ నిరసన ప్రదర్శన. చిత్రంలో మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు
డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళనలు
నల్లబ్యాడ్జీలు, నల్లచొక్కాలు ధరించి విధులకు హాజరు.. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నిరసన గళమెత్తారు. డిమాండ్ల సాధన కోసం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అత్యంత ప్రధానమైన సమస్యలను ప్రభుత్వం వేగవంతంగా పరిష్కరించాలని నినదించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇప్పటివరకు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పిస్తూ సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి చేస్తూ వచ్చిన తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీఈజేఏసీ).. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. మండల, డివిజన్, జిల్లా కేంద్రాలతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం ఇలా... అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సచివాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అబిడ్స్ బీమా భవన్, హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జరిగిన నిరసనల్లో టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ బి.శ్యామ్, హుస్సేని, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. కీలకాంశాలపై ప్రభుత్వం స్పందించపోవడంతో నిరసనలకు దిగాల్సి వచ్చిందని.. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుంటే వచ్చే నెల 5న జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ కాంప్లెక్స్‌లు, ధర్నా చౌక్‌ల వద్ద దీక్షలకు దిగాలని నిర్ణయించామని మారం జగదీశ్వర్ చెప్పారు. ఆ తదుపరి కార్యాచరణపై మే 14న చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నివేదిక తెప్పించుకోకుండా గడువు పొడిగిస్తూ పోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. పెండింగ్ బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. నెలవారీగా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రతినెలా జరిగే రిటైర్మెంట్లతో బకాయిలు మరింత పెరుగుతున్నాయన్నారు.
రిటైరైన వారిలో 260 మంది మరణించినా ఆయా కుటుంబాలకు బెనిఫిట్లు అందకపోవడం అత్యంత బాధాకరమని చెప్పారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కలగాలంటే ఓపీఎస్ అమలు చేయాల్సిందేనని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,316 మంది సీపీఎస్ ఉద్యోగులు రిటైరవగా వారికి కనీస సామాజిక భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకే నిరసన కార్యక్రమాలు చేపట్టామని వి. లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఉద్యోగుల కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ... ప్రధానమైన అంశాల్లో జాప్యం చేస్తోందని విమర్శించారు.
ప్రధాన డిమాండ్లు ఇవే...
⇒ రెండున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం పీఆర్సీ నివేదిక తెప్పించుకోలేదు. వెంటనే నివేదిక తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించాలి.
⇒ రూ. 13 వేల కోట్ల బకాయిలను ఒకే దఫాలో విడుదల చేయాలి.
⇒ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్‌ఎస్‌ను అమల్లోకి తేవడంతోపాటు నగదురహిత చికిత్సను తక్షణమే అందించాలి.
⇒ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్)ను పునరుద్ధరించాలి. 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ వర్తింపజేయాలి.
⇒ 64 సమస్యలకు సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి.


