ఉప్పల్: ఉప్పల్ వివిధ కారణాలతో సర్కిల్–2 పరిధిలో మూసివేసిన రేషన్ షాపులను మళ్లీ తెరిపించాలని కోరుతూ మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి కలెక్టర్ మనుచౌదరిని కోరారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు రేషన్‌షాపులను మూసి వేయించడంతో ఆయా ప్రాంత వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మూసివేసిన రేషన్‌షాపులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, వృద్ధులు, దివ్యాంగులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆగంరెడ్డి, పూజారి హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.


